పక్కాగా చెక్కులు పంపిణీకి ఏర్పాట్లు

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం,మే5(జ‌నం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా  చేపట్టిన రైతుబంధు కార్యక్రమం విజయవంతంగా అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీనిని సక్రమంగా ముందుకు తీసుకుని వెల్లాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంత్‌ గాంధీ ఇప్పటికే ఆదేశించారు.ఈ నెల 10 నుంచి 17 వరకు రైతుబంధు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రతి అధికారి శక్తివంచన లేకుండా కృషిచేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాలకు పాస్‌పుస్తకాలు, చెక్కులను తరలించామని, ఎన్నికల పక్రియ వలే పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో అందించాలని స్పష్టంచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ల పాత్ర
కీలకమని, ప్రతి టీం లీడర్‌కి ఎన్ని పాస్‌పుస్తకాలు, చెక్కులు ఇస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. గ్రామంలో పంపిణీ పూర్తయిన తర్వాత మిగిలిన చెక్కులు పుస్తకాలను తహసీల్దార్‌కు అప్పగించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆధార్‌ కార్డులు లేని రైతులకూ చెక్కులు పంపిణీ చేయాలన్నారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు చెక్కుల పంపిణీ చేయాలన్నారు. రైతుబంధు పథకం చెక్కుల నగదు విషయంలో సంబంధిత బ్యాంకు అధికారులతో సంప్రదించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నగదు చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. చెక్కులు పంపిణీ కేంద్రాల వద్ద, సంబంధిత బ్యాంకుల వద్ద రైతులకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పోలీసు అధికారులతో ముందుగానే చర్చించి పంపిణీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పంపిణీ రోజువారీ నివేదికను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంకు తెలపటంతోపాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపాలన్నారు. కార్యక్రమం చేపట్టే గ్రామాల్లో మూడురోజుల్లో ముందుగానే విస్తృత ప్రచారం చేయాలన్నారు. చెక్కు ఇచ్చే ప్రతి రైతుకు స్లిప్‌ ఇవ్వాలన్నారు. ఇదిలావుంటే రైతుబంధు పథకంలో అర్హులైన రైతులకు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కోసం ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఖమ్మం ఆర్డీఓ తాళ్లూరి పూర్ణచంద్ర అధికారులకు సూచించారు. 10 నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పక్రియను రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి చేయాలన్నారు. రెండు శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, పంపిణీకి సంబంధించి గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. 300 మంది రైతులకు ఒక అధికారుల బృందం చొప్పున గ్రామాల్లో అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీఆర్‌ఏ, వీఆర్వో, వ్యవసాయ అధికారులతో కూడిన బృందాలను ముందుగానే నియమించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల వివరాలను ముందుగానే రైతులకు తెలిసే విధంగా టాంటాం, ప్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.