పరకాల ప్రచారానికి కదలిన జేఏసీ దండు
హైదరాబాద్: పరకాల ఉప ఎన్నిక ప్రచారానికి తెలంగాణ జేఏసీ దండు కదిలింది. శుక్రవారం యాత్రగా బయలుదేరిన బృందానికి జేఏసీ చైర్మన్ కోదండరాం జెండా ఊపి ప్రోత్సహించారు. ఈ బృందం పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతికి మద్దతుగా ప్రచారం నిర్వహించనుంది. గ్రామ గ్రామాన ఈ బృందం తెలంగాణ ఆవశ్యకత, భిక్షపతి గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించనుంది. యాత్ర ప్రారంభించిన అనంతరం కోదండరాం మాట్లాడుతూ బృందం నాయకులు పరకాలలో తెలంగాణవాదం గెలువాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తారని తెలిపారు. పరకాల ఉప ఎన్నిక తెలంగాణ ఉద్యమానికి కీలకంగా మారిందని వివరించారు. తాము ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఎంతగా ప్రయత్నించినా, పార్టీలు సహకరించలేదన్నారు. బీజేపీ వల్ల ఓట్లు చీలకుండా, బలంగా తెలంగాణవాదాన్ని వినిపిస్తున్న టీఆర్‌ఎస్ గెలిచేలా ముమ్మర ప్రచారం చేయాలని కోదండరాం బృందం సభ్యులను కోరారు. ఓట్లు చీలితే సమైక్యవాద పార్టీ అభ్యర్థి కొండా సురేఖ గెలిచే అవకాశముందని, అలా జరుగకుండా సురేఖ ఓటమే లక్ష్యంగా తమ బృందం కృషి చేస్తుందన్నారు.