పాపం నేపాల్
– ఆప్తుల్ని కోల్పోయి అర్థాకలితో అలమటిసూ ్త
-గూడు చెదిరింది, గుండె పగిలింది
– సాయం కోసం ఆర్తిగా ఎదరుచూపు
ఖాట్మండ్,ఏప్రిల్30(జనంసాక్షి):
పెను భూకంపం సంభవించి ఐదు రోజులైనా నిలువ నీడ లేని వారు ఎందరో ఇప్పుడు తమకు ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. అయినవారు ఎవరున్నారో ఎవరు లేరో తెలియని స్థితిలో దిక్కుతోచకుండా ఉన్నారు. ఉండడానికి గూడు, తినడానికి దిండి లేక అల్లాడుతున్నారు. తిండీ నీరూ.. అన్నీ ఇప్పడుఉ భూకంప ప్రాంతాల్లో పెద్ద సమస్యగా మారింది. నేపాల్ ప్రజల ముందు ఇప్పుడున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. నేపాల్‌లోని చాలా ప్రాంతాల్లో నివాస భవనాలు భూకంపం కారణంగా నేలమట్టమయ్యాయి. పలు దేశాల నుంచి సహాయక సిబ్బంది వచ్చి సహాయం అందిస్తున్నప్పటికీ బాధితులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో సహాయ చర్యలు, ఆహార సామాగ్రి సరిపోవడం లేదు. దీంతో ప్రజల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. తమకు ఆహారం, నీరు అందడం లేదని పలువురు వాపోతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో మారుమూల ప్రాంతాలకు సహాయ సిబ్బంది వెళ్లలేకపోతున్నారు. దీంతో వారు నిత్యావసరాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీరు కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ నివసించడం నరకం లాగా ఉందని.. సహాయం అందకపోతే ఇక మరణమే శరణ్యమని బాధితులు వాపోతున్నారు.
5కోట్లు సహాయం ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం
భూకంప ధాటికి ధ్వంసమైన నేపాల్‌కి ఆర్థికసహాయం అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ముందుకువచ్చింది. నేపాల్‌కి ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ రూ.5కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. నేపాల్ ప్రజలు ఈ స్థితి నుంచి త్వరలోనే కోలుకోవాలని సీఎం నవీన్ పట్నాయక్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. భూకంపం సంభవించిన సమయంలో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు నవీన్ పట్నాయక్ ఓడీఆర్‌ఏఎఫ్ సిబ్బందిని పంపించిన సంగతి తెలిసిందే.
దిల్లీలో జోలె పట్టిన నేపాల్ విద్యార్థులు
దేశ రాజధాని దిల్లీలో నేపాల్ విద్యార్థులు విరాళాలు సేకరిస్తున్నారు. దిల్లీలో చదువుకుంటున్న వీరు భూకంప బీభత్సానికి అతలాకుతలమైన తమ దేశానికి సహాయం అందించేందుకు విరాళాలు సేకరిస్తున్నారు. గత వారం నేపాల్‌లో సంభవించిన భూవిలయానికి 6వేల మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. నేపాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ విద్యార్థులు దిల్లీలో విద్యనభ్యసిస్తున్నారు. కళాశాలలో తరగతులు అయిపోగానే వీరంతా దిల్లీ వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. సేకరించిన మొత్తంతో సహాయ సామగ్రి కొనుగోలు చేసి ఒకసారి తమ దేశానికి పంపించామని, ఇంకా విరాళాలు సేకరిస్తున్నామని ఆ విద్యార్థులు తెలిపారు.