పురుగు మందు తాగి వివాహితులు ఆత్మహత్య
వివాహేతర సంబంధం.. పెద్దలు అంగీకరించరని మనస్తాపం
*పురుగు మందు తాగి వివాహితులు ఆత్మహత్య
జూలూరుపాడు, ఆగష్టు 7, జనంసాక్షి: వివాహేతర సంబంధాన్ని పెద్దలు అంగీకరించరని మనస్థాపం చెంది వివాహితులు ఇద్దరు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని వినోభానగర్ గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని వినోభానగర్ గ్రామానికి చెందిన తంబారపు ప్రసన్న జ్యోతి (23)కి అదే గ్రామానికి చెందిన కరుణాకర్ అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. భార్యా భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా ప్రసన్న తన పుట్టింట్లో ఉంటుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఆమె ఇటీవల కొత్తగూడెంలో కోచింగ్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వివాహితుడైన ట్రాలీ డ్రైవర్ సిరికొండ ప్రశాంత్ (30) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. వివాహేతర సంబంధాన్ని పెద్దలు అంగీకరించరని ఇరువురు మనస్థాపం చెందుతున్నారు. ఈ నేపధ్యంలో రెండు రోజుల క్రితం హాల్ టిక్కెట్ కోసం జూలూరుపాడు వచ్చిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో పెద్దలు ఆచూకీ కోసం వెతికారు. ఖమ్మం సమీపంలో ప్రసన్న జ్యోతి, ప్రశాంత్ ఇద్దరు పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని అక్కడి వారు కొందరు ఓ ఆసుపత్రిలో చేర్పించగా వైద్యం పొందుతూ మృతిచెందారు. ఈ మేరకు ఎస్సై పోటు గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.