పెరిగిన విద్యుత్ కోతలు అల్లాడుతున్న ప్రజలు
నెల్లూరు, జూలై 8 : నెల్లూరు జిల్లాలో వేళాపాళా లేకుండా విధిస్తున్న విద్యుత్ కోతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం రాత్రి పది గంటల నుంచి 12 గంటల వరకు కోత విధించడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక అధికారుల చెబుతున్న వివరాల ప్రకారం జిల్లా కేంద్రాలలో 4 గంటలు, మండల కేంద్రాలలో 6 గంటలు, గ్రామీణ ప్రాంతాలలో 8 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నట్టు చెబుతుండగా, ఇందుకు భిన్నంగా జిల్లా కేంద్రంలోనే సుమారు 8 గంటల పాటు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. నగరాలలో పది గంటల పాటు విద్యుత్ కోత విధిస్తుండగా, గ్రామీణ ప్రాంతాలలో వేళాపాళా లేకుండా పది నుంచి 14 గంటల పాటు కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో నెల్లూరు జిల్లా అంధకారంలో ఉండిపోతోంది. వాస్తవానికి జిల్లాకు 80లక్షల యూనిట్లు అవసరం కాగా, 70 లక్షల యూనిట్లు మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో విద్యుత్ కోత విధించాల్సిన అవసరం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని గ్రామాలలో కరెంట్ కోత కారణంగా ప్రజల్లో సహనం నశించి సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. గతరాత్రి జలదంకి, పెదపడియా, ఉదయగిరి, సీతారామపురం ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు. వాస్తవానికి విద్యుత్ కోతలు తమ చేతుల్లోలేవని, హైదరాబాద్‌లోని అధికారుల నిర్ణయం మేరకే విద్యుత్ కోతలు విధిస్తున్నట్టు ఎపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ నందకుమార్ తెలిపారు. మరోవైపు వర్షాలు పడకపోవడం, జలాశయాలలో నీరు లేకపోవడం వంటి పరిస్థితులు పరోక్షంగా విద్యుత్ కోతలు పెరగడానికి దారితీస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 7,58,738 విద్యుత్ కనెక్షన్లు, 64,310 వాణిజ్య కనెక్షన్లు, 41,155 పరిశ్రమల కనెక్షన్లు, లక్షా 20వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు, 8వేలకు పైగా మంచినీరు, వీధిదీపాల కనెక్షన్లు, 598 హై టెన్షన్ కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం వినియోగంలో 40 శాతం గృహ వినియోగదారులు, 15 శాతం వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే పది లక్షల యూనిట్లు మిగులుతున్నప్పటికీ వేళాపాళాలేని విద్యుత్ కోతలతో పలు రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మరో నెల రోజులలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా, ఇదే పరిస్థితి కొనసాగితే రూ. కోట్లలోనే పంటల నష్టాలను చవి చూడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.