పేరుకే పెద్దాస్పత్రి… అందని వైద్యసేవలు
సౌకర్యాలపై పెదవి విప్పని నేతలు
నిజామాబాద్,మార్చి3(జనంసాక్షి): జిల్లా పెద్దస్పత్రిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆరోగ్యశాఖ పనితీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు డబ్బులు దండుకుంటున్నారని, మరోవైపు రోగులను పట్టించుకోవడం లేదని, సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి వైద్యాధికారుల వరకు పరిస్థితి ఇలాగే ఉంది. ప్రాణాపాయ స్థితిలో వచ్చే రోగికి భరోసా కల్పించడం కాదుకదా వీరి నిర్లక్ష్యం చూసి అక్కడికక్కడే ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆధునికమైన వైద్య పరికరాలు ఉన్నప్పటికీ సేవా దృక్పథంతో కూడిన వైద్యులు, సిబ్బంది లేకపోవడం ఆస్పత్రికి శాపంగా మారింది. దీని ఫలితంగా రోగులకు వైద్యసేవలు సరిగా అందడంలేదు. ఆయుష్షు ఉన్నవాడు బతుకుతాడు అన్నట్టుగా తయారైంది.
జంకుతున్న పల్లెజనాలు
పల్లెజనాలు ఇక్కడికి రావాలంటేనే జంకుతున్నారు. పేద ప్రజలు ప్రైవేట్ భారాన్ని తట్టుకోలేక, ఇక్కడి వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు. రోగాలు నయం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న రోగాలైతే ఎలాగోలా అందిన వైద్యంతో సరిపెట్టుకోగలరు. కాని తీవ్రమైన రోగాలు విషజ్వరం, మలేరియా, టైఫాయిడ్, సైన్‌ఫ్లూ వంటివి వస్తే ఇక్కడ అందే వైద్యంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిందే. పలు రోగాల నిర్ధారణకు అవసమయ్యే రక్త, మూత్ర, ఇతర పరీక్షలు, స్కానింగ్‌లు చేసుకోవాలంటే చేతులు తడుపాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకోవాలంటే డబ్బులు చాల ఎక్కువవుతాయనే, ఇబ్బందులు ఉన్నాయనే పేదరోగులు ఇక్కడికి వస్తారు. అయినప్పటికీ ఇక్కడా డబ్బులు దండుకోవడంతో వారికి ఎక్కడికి పోవాలో తెలియడం లేదు. కొందరు బతిమాలుకుని, చేతిలో ఉన్న కాస్త డబ్బును సిబ్బంది, వైద్యులకు ఇచ్చి పనికానిచ్చుకుంటున్నారు. అప్పటికీ భరోసా గల వైద్యం అందుతుందనే నమ్మకం మాత్రం లేనప్పటికీ, దేవుడిపై భారం వేస్తూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ప్రాణాల విూదికి వచ్చిందనుకుంటే మాత్రం చివరిదశలో దైర్యం చేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అలా డబ్బు, ప్రాణాలు పోయి మిగిలిన కుటుంబసభ్యులు రోడ్డున పడ్డ ఘటనలు చాలా ఉన్నాయి. స్థిరాస్తులను అమ్మి వైద్యం అందించినప్పటికీ నగరానికి చెందిన నర్సయ్య అనే ఇంటి యజమాని ప్రాణాలు నిలువలేదు. దీంతో అతని కుటుంభం పెద్ద దిక్కును కోల్పోయింది. తమకు ఉపాధి కల్పించాలని కనిపించినవారిని వేడుకుంటున్నారు కుటుంబసభ్యులు. ఇలాంటి నర్సయ్య కుటుంబాలు జిల్లా మొత్తంలో పెద్దస్పత్రి భారిన పడి సర్వం కోల్పోయినవి చాలా ఉన్నాయి. ఇక అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు, వారి కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయం. ప్రమాదాల భారిన పడి కొనాప్రాణాల విూద వచ్చే వారికి కూడా వైద్య సేవలు అందడం లేదని బాధితులు ఫిర్యాదులు చేసిన ఘటనలు కోకల్లలు. 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉంది. అందుకు తగిన సిబ్బందిని, వైద్యులను, అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. అయినప్పటికీ వైద్యులు, సిబ్బం ది నిర్లక్ష్యం, ధనార్జనే ద్యేయంగా పనిచేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అప్పుడప్పడు శస్త్రచికిత్సలను కూడా కిందిస్థాయి సిబ్బంది చేసిన దాఖలాలు ఉన్నాయి. చాలాసార్లు అటెండర్లు, కాంపౌడర్లు వైద్య సేవలు అందిస్తారు. ఇది రోగుల ప్రాణాలతో ఆడుకోవడమేనని ప్రజలు వాపోతున్నారు. పాము, కుక్క కాటుకు అవసరమైన వైద్యం ఎప్పుడూ అందదని రోగులు చెబుతున్నారు. ముఖ్యంగా పొలాల్లో తిరిగే వ్యవసాయ కూలీలు, రైతులు పాముకాటుకు గురవుతారు. మారుమూల పల్లెల్లో పాముకాటుకు గురువగా అక్కడి పీహెచ్‌సీ కేంద్రాల్లో మందులు లేక జిల్లా ఆస్పత్రులకు సిఫారసు చేస్తారు. ఇక్కడికి ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని రాగా ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యంతో వైద్యం అందదు. అంతేకాకుండా మాములు చికిత్సలే సక్రమంగా చేయరని, శస్త్రచికిత్సలను ఈ ఆస్పత్ర్రుల్లో చేయించుకుంటే ఇక అంతేనని బాధిత కుటుంబాలు బాహాటంగా చెబుతున్నాయి.
ఆధునిక వసతులు ఉన్నా అందని వైద్యం
ముఖ్యంగా పెద్దాస్పత్రిని అన్ని హంగులతో, ఆధునిక వైద్య పరికాలతో, పూర్తి సదుపాయాలతో నిర్మించారు. కాని సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యమే రోగులకు శాపంగా మారింది. ఈ విషయాన్ని పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి కూడా బాధిత కుటుంబాలు, మరి కొందరు తీసుకెళ్లారు. అయినప్పటికీ సిబ్బంది, వైద్యుల్లో మార్పు రాలేదు. ఇటీవల జిల్లా కలెక్టర్ రోనాల్&ఢరాస్ వైద్య,ఆరోగ్య శాఖపై తీవ్రవంగా మండిపడిన విషయం తెలిసిందే. అయినా వీరిలో మార్పు రాలేదు. కుక్క తోక వంకర అనే చందంగా తయారైంది. గతంలో సాక్షాత్తూ జిల్లా వైద్యాధికారిపైనే అవినీతి ఆరోపణలు వచ్చిన దాఖాలాలు ఉన్నాయంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి శాఖాధికారులపై సీరియస్ అయ్యారంటే జరిగిన తప్పులను అంచనా వేసుకోవచ్చు. గాడితప్పిన వైద్యం, శాఖ పరిపాలన విభాగం వలన జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జిల్లా మొత్తంగా ఎక్కడ రోగాలు ప్రభలినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వైద్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం అందరినీ ఆందోళనకు గురిచెస్తుంది. జిల్లా ఆరోగ్యం ఈ శాఖ చేతిలో ఉంటుంది. వీరు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు రోగాల బారిన పడకుండా జిల్లా ప్రజలకు సూచనలు చేయాల్సిన అవసరం ఉంది.
కొనుగోళ్లలో అక్రమాలు
అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఈ శాఖాధికారులు డబ్బుల కోసం పనులు చేస్తూ వైద్య వృత్తికి కలంకం తెస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు మందుల కొనుగోళ్లలో, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడిన విషయం తెలిసిందే. కుంభకోణాలు బయటపడడం విచారణలు, అధికారుల సస్పెన్షన్లు వైద్యశాఖలో కొత్తకాదు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల బదిలీలు సర్వసాధారణం అయ్యాయి. పైఅధికారులతో మచ్చిక చేసుకుని ఇష్టమైన చోట పోస్టింగ్‌లు ఇప్పించడం, డిప్యూటేషన్లపై అవసరమైన చోట పనిచేయడం జరుగుతుంది. ఇలా అధికారులు అన్ని విధాలుగా పలు ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీరిపై విచారణ కూడా జరుగుతున్నాయి. పలు పీహెచ్‌సీల్లో మందుల కొనుగోళ్లలో దాదాపుగా 30 లక్షల రూపాయలకు పైగా కుంభకోణం జరిగింది. దీనిపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. కాని విచారణ అధికారులు తూతూమంత్రంగా విచారణ చేపట్టడంతో పూర్తి వివరాలు తెలియలేదు. విచారణ కూడా పెండింగ్‌లో ఉండడంతో అటు నిందితులు దర్జాగా మరిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు వాపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యశాఖపై పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తేనే ప్రజలకు మెరుగైన వైద్యం కాకపోయినప్పటికీ కనీస వైద్యమైనా అందుతుందని రోగుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో పెద్దస్పత్రిని ఇతర ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కనీసం ఆస్పత్రిని ఇక్కడి నుంచి తరలించిన తర్వాత అయినా ఇక్కడ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం అందుతుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిని ఎక్కడికి తరలించినప్పటికీ సిబ్బందిలో మార్పు రాకపోతే రోగులకు వైద్యసేవలు అందయని పలువురు పేర్కొంటున్నారు.