ప్రజల పన్నులు కడుతున్నా వాతలేనా?
ప్రజలు సరిగా పన్నులు కట్టకపోవడం వల్లనే పెట్రోధరలు పెంచాల్సి వస్తోందని ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్ల ఈ చేసిన వ్యాఖ్యలు ప్రజలను అవమానించేవిగా ఉన్నాయి. అసలు ఏ పన్ను కట్టకుండా ప్రజలు గడపదాటి బయటకు రాకుండా పన్నుల ఉచ్చులో దించారు. జిఎస్టీతో ఆదాయం పెరిగిందని చంకలు గుద్దుకుంటున్న వారు దుబారా ఖర్చులు మాత్రం తగ్గించుకోవడం లేదు. రాజకీయ దుబారా ఈ దేశంలో జరిగినంతగా ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. అనవసర పోస్టులను ఏర్పాటు చేసుకుని ప్రజల సొమ్ములతో కులకుతున్నారు. వ్యవస్థలను మార్చాల్సిన పాలకులు అధికారంలోకి రాగానే ఓట్లు దండుకునే పథకాలను ప్రవేశ పెట్టడం, వాటిని కొనసాగించడం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం వల్ల పన్నులు కట్టలేక మధ్యతరగతి ప్రజల నడ్డి విరుగుతోంది. పన్నులు కట్టే ప్రజలకు జవాబుదారీ లేకుండా పోతోంది. ఉపాధి హావిూకింద ఏటా వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నా పనికి వచ్చే పనుఉల జరగడం లేదు. దీనిని సవిూక్షించాలన్న కనీస పరిజ్ఞానం కూడా ప్రభుత్వానికి కలగడం లేదు. దీంతో గ్రామాల్లో వ్యవసాయ కూలీలు కరువయ్యారు. 132 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో కూలీలు ఎందుకు దొరకడం లేదన్న ఆలోన చేయడం లేదు. సబ్సిడీ పథకాలకు ప్రజలను అలవాటు చేసి వారిని నిర్వీర్యులుగా చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో కూలీలు దొరకడం కష్టంగా మారింది. వ్యవసాయ కూలీల సంగతి చెప్పనక్కర్లేదు. మారుమూల గ్రామాల్లో సైతం ఇప్పుడు కప్పు చాయ పది రూపాయలు. ధరల విషయంలో పల్లెలకు పట్టణాలకు తేడా లేకుండా పోయింది. సామాన్యులు సైతం పదిరూపాయలు పెట్టి చాయ్ తాగుతున్నారు. అలాగే సాయంత్రం అయ్యే సరికి మద్యం షాపులు కిటకిటలాడుతున్నాయి. కూలీనాలీ చేసుకునే వారు కిక్కులేనిదే ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రూపాయికే కిలో బియ్యం పథకాన్ని కొనసాగించడం సరికాదు. దీనిని తొలగించడం వల్ల వేలకోట్ల రూపాయల వృధాను అడ్డుకోవచ్చు. ఈ బియ్యం పథకం ప్రభుత్వాలకు గుదిబండగా మారినా గంట కట్టేదెవరన్నది సాహసించడం లేదు. ఓట్లతో ముడిపడి ఉన్న ఈ పథకాన్ని తొలగించాల్సిందే. తెలుగు రాష్టాల్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతున్న కిలో రూపాయి బియ్యాన్ని తక్షణం తొలగించడం ద్వారా ప్రజల సొమ్ముకు రక్షణగా నిలవాలి. కిలో రూపాయికే ఇస్తున్న చౌక బియ్యం అక్రమంగా రాష్టాల్ర సరిహద్దులు దాటుతున్నాయి. పేదలు కడుపునిండా తినాలన్న ఈ పథకం ఇప్పుడు కొందరికి వ్యాపారంగా మారింది. మరికొందరికి ఆదాయ వనరుగా మారింది. అలాగే రీసైక్లింగ్ పేరుతో సన్నబియ్యంగా మార్చి అమ్ముకునే వ్యాపారంగా మారింది. చెక్‌పోస్టులు,తనిఖీ కేంద్రాలు, పోలీసులు ఉన్నా బియ్యం రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. ఎవరి స్థాయిలో వారికి మామూళ్లు అందుతుండటంతో వ్యాపారం జోరుగా సాగుతోందన్నది కఠోర సత్యం. ఫలితంగా పేదలపేరుతో సర్కార్ అందచేస్తున్న బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. ఇక కొందరు ఈ బియ్యాన్ని అమ్ముకుని సన్నబియయం కొనుక్కుని తింటున్నారు. చాలామంది తెల్ల రేషన్ కార్డుదారులు ఈ బియ్యాన్ని అమ్ముకోవడానకే ఇష్టపడుతున్నారు. ఇలా రెండు తెలుగు రాష్టాల్ల్రో ఈ పథకం అమలు సంగతి ఎలా ఉన్నా లక్ష్యం మాత్రం నీరుగారుతోంది. తద్వారా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న నిధులు వృధా అవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సబ్సిడీ తొలగించి నగదు బదిలీ చేపట్టింది కేంద్రం. దీంతో గ్యాస్ సబ్సిడీలో కొంతయినా అక్రమాలను అరికట్టగలిగారు. బియ్యం పథకం కోసం సబ్సిడీ రూపంలో వేలకోట్లతో పాటు పెద్ద యంత్రాంగం పనిచేయాల్సి వస్తోంది. ఇలాంటి దుబారాను అరికట్టి నిజమైన పేదలకు లబ్ది చేకూర్చేలా కార్యాచరణచేయాలి. బియ్యం పథకాన్ని ఎత్తేసే ఆలోచన చేస్తే మంచిది. రూపాయికి విలువ లేని సమయంలో కిలో బియ్యాన్ని అందచేసి అక్రమాలకు తావీయకుండా దీనిని ఎప్పుడో తొలగించాల్సింది. ఆలస్యంగా అయినా దీనిని తొలగించడంలో ఇద్దరు చంద్రులు నిర్ణయం తీసుకోవాలి. ఎపిలో చంద్రన్న మాల్స్ ఏర్పాటుచేయడం ద్వారా సరకులను తక్కువ ధరలకు ఇవ్వాలని చూస్తున్నారు. రైతు బజార్లను పటిస్టం చేసి అక్కడే అన్ని సరకులను తక్కువ ధరలకు అమ్మితే పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసినవారం అవుతాం. అంతేగాని రూపాయికే బియ్యిం ఇచ్చి వృధాను ప్రోత్సహించడం ప్రభుత్వాలకు మంచిది కాదు. నిజంగా ఇరు తెలుగురాష్టాల్ర ప్రభుత్వాలకు ఇది మోయలేని భారంగనే మారింది. అయినా సబ్సిడీ బియ్యాన్ని రూపాయికే కొనసాగించడం సరికాదు. ఉమ్మడి ఎపిలో సబ్సిడీ బియ్యం ధరను పెంచి అక్రమాలను అరికట్టినప్పుడు అప్పట్లో సిఎంగా ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆరోజుల్లోనే ఆయన దీనిని ఐదు రూపాయలకు పెంచారు. కానీ ఇప్పుడు రూపాయికే బియ్యం కావడంతో అక్రమ వ్యాపారానికి తెరతీసారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు బియ్యం సేకరణ తలకు మించిన భారంగా మారింది. జాతీయ భద్రత చట్టం కింద కొంత కేంద్రం సబ్సిడీ బియ్యాన్ని అందిస్తోంది. మిగిలిన లక్షల కార్డులకు పంపిణీ చేస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ భరించాల్సి వస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడుతోంది. ఇదంతా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న సొమ్ము అని పాలకులు గుర్తించాలి. అప్పుడే పన్ను కట్టే ప్రజలకు న్యాయం జరుగుతుంది. దీంతో అనేక అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. దీనిని మరింత పక్కాగా అమలు చేస్తే కొంతయినా అవినీతిని అరికట్టవచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు.