ప్రపంచం శాంతి కోరుకుంటోంది

ప్రపంచం శాంతి కోరుకుంటోంది. ప్రాచ్యదేశాలు ఉగ్రవాదంతో నిత్యం మారణ¬మంలో మునిగి పోయాయి. బాంబుదాడులు, టెర్రరిస్ట్‌ దాడులతో ప్రజల బతుకులకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఐఎస్‌ఐఎస్‌, తాలిబన్లు, లష్కరే తోయిబా లాంటి సంస్థల కారణంగా ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తు న్నారు. యుద్దాలు రావాలని, జననహవనం జరగాలని ఎవరూ కోరుకోవడం లేదు. రాక్షస జాతి సాగించే మారణ¬మంతో ఇప్పటికే ప్రపంచ ప్రజల్లో శాంతి కరువయ్యింది. ఇస్లామిక్‌ తీవ్రవాదం కట్టుతప్పింది. ఈ దశలో అణుముప్పును నివారించేందుకు ఉత్తర కొరియా, అమెరికాల మధ్య జరిగిన శాంతి ఒప్పందం ప్రపంచానికి మేలు చేసేదిగానే భావించాలి. ట్రంప్‌, కిమ్‌జోంగ్‌ తమ వ్యక్తిగత స్వభావాలు, ధోరణులకు భిన్నంగా శాంతిచర్చలకు కూర్చోవటం తక్షణ అవసరంగా ముందుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మధ్య సింగపూర్‌లో జరిగిన శాంతి చర్చలు ఫలవంతంగా ముగియటం ఆహ్వానించదగ్గ పరిణామం. శాంతిని కోరుకుంటున్న భారతదేశం కూడా ఈ చర్చలను ఆహ్వానించింది. ఇదో మంచి పరిణామంగా గుర్తించింది.ఈ సందర్భంగా ఉత్తర కొరియా అణ్వస్త్ర నిరాయు ధీకరణతోపాటు, దౌత్య, వాణిజ్యపర ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేయటం కొరియా ద్వీపకల్ప ప్రాంతానికే గాక, ప్రపంచశాంతికి శుభ సూచకం. ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారన డానికి సింగపూర్‌ డిక్లరేషన్‌ ఉదాహరణగా చెప్పుకోవాలి. చరిత్రలో అద్భుతఘట్టంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ భేటీ ముగిసింది. కార్యం చక్కబెట్టుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు ప్రపంచం త్వరలోనే ఒక అద్భుతమైన మార్పు చూడబోతున్నదని హావిూ ఇచ్చారు. మొత్తంగా అణుముప్పు ఉందని బెదిరించిన కిమ్‌ ఎట్టకేలకు దేశప్రయోజనాలను కూడా కాపాడు కున్నారనే చెప్పాలి. అణునిరాయుధీకరణ విషయంలో ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన అడుగు పడిందని భావించాలి. ఇంతకాలం ఈ రెండు దేశాల వ్యవహారశైలినీ, ఇద్దరూ కలసి ప్రపంచాన్ని యుద్ధం అంచుకు నెట్టిన వైనాన్నీ చూసిన తరువాత, ఇప్పుడు ఏర్పడిన ఈ వ్యక్తిగత బంధం కచ్చితంగా గతం పునరావృతం కాకుండా కాపాడవచ్చు. ఉభయదేశాలూ శాంతి, సౌభాగ్యాల సాధనకు కట్టుబడటం, కొత్త సంబంధాలు నెలకొల్పు కోవడం, కొరియా ద్వీపకల్పంలో సుస్థిరశాంతికి కలిసి కృషిచేయడం వంటి విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ భేటీకోసం కిమ్‌ చూపిన చొరవ, తీసుకున్న కీలక నిర్ణయాలు ఏ విధంగా ఆయనపట్ల ప్రపంచానికి విశ్వాసాన్ని కలిగించాయో, ట్రంప్‌ ఈ తొలి నిర్ణయం కూడా పరస్పర విశ్వాసాన్ని పెంచేలా ఉంది. సింగపూర్‌ భేటీతో ఇరుదేశాల మధ్యా ఉన్న ఘర్షణపూరితమైన వాతావరణం తొలగిపోయింది. పక్కనే ఉన్న దక్షిణకొరియా ఆర్థికంగా ఎదిగి పోతోంది. అమెరికా అండ, స్వేచ్ఛా మార్కెట్‌ విధానంతో సామ్‌సంగ్‌, హ్యూందాయ్‌, ఎల్‌జీ లాంటి దిగ్గజ కంపెనీలకు స్థావరంగా మారి ఆర్థికంగా బలపడింది. ఈ పరిస్థితులన్నీ ఉత్తర కొరియా పాలకుల్లో మార్పునకు కారణమై ఉంటుంది. అమెరికాకు ఎదురొడ్డి నిలిచే కంటే, రాజీతో దేశాన్ని ముందుకు తసీఉకుని వెళ్లాలన్న ఆలోచన కూడా కిమ్‌ను ముందుకు నడిపించి ఉంటుంది. దుందుడుకు తనానికీ, పెడసరి మాటలకు పెట్టింది పేరుగా ప్రపంచమంతా భావిస్తున్న ట్రంప్‌, జగమొండి తనానికీ, తెగేదాకా లాగే తత్వానికీ ఆనవాలుగా చెప్పుకొనే కిమ్‌ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని ఎవరూ భావించలేదు. ఇరు దేశాధినేతలు పంతాలు పట్టింపులకు పోకుండా సమస్యలకు చర్చలతో శాంతియుత పరిష్కారాల దిశగా అడుగులు వేయటం ప్రపంచానికి మంచిదే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామ్యవాద, పెట్టుబడిదారీ కూటముల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు ప్రపంచాన్నే రెండు

విభిన్న శిబిరాలుగా విభజించింది. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలు ముక్కలయ్యాయి. జర్మనీా తూర్పు, పశ్చిమ జర్మనీలుగా విడిపోయినట్లు గానే కొరియా కూడా ఉత్తర, దక్షిణ కొరియాలుగా చీలిపోయింది. సామ్యవాద సోవియట్‌ రష్యా అనుకూల దేశాలుగా తూర్పు జర్మనీ, ఉత్తర కొరియా ఉంటే, పెట్టుబడిదారీ అనుకూల దేశాల ప్రతినిధులుగా పశ్చిమ జర్మనీ, దక్షిణ కొరియా అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. ఈ రెండు కూటముల మధ్య ఏడు దశాబ్దాలుగా ఆధిపత్య పోరు సాగుతూనే ఉన్నది. సోవియట్‌ యూనియన్‌ పతనమై, బెర్లిన్‌ గోడ బద్దలై పోయిన తర్వాత ఉత్తర కొరియా మాత్రమే అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది. కొరియా ద్వీపకల్పంపై, ఆప్రాంత సముద్ర జలాలపై ఆధిపత్యం నిలుపుకోవాలనే వ్యూహంలో ఉత్తర కొరియా పెద్ద అడ్డంకిగా మారింది. ఈ చారిత్రక, భౌగోళిక వ్యూహాలతోనే అమెరికా నాటి నుంచీ నేటిదాకా ఉత్తరకొరియాపై కత్తిగట్టి, ఆంక్షలు, ఒత్తిళ్లతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించింది. దక్షిణ కొరియాను అమెరికా సైనిక స్థావరంగా మార్చేసింది. దీంతో దక్షిణ కొరియా నుంచి అమెరికా తన సైనికులను ఉపసంహరించుకోవాలని ఉత్తర కొరియా డిమాండ్‌ చేయటం, దానికి ప్రతిగా రష్యా అండతో ఉత్తర కొరియానే ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నదని ప్రతిదాడి చేయటం కొనసాగింది. సుదీర్ఘ కాలంగా కొరియా ద్వీపకల్ప ప్రాంతం ఉద్రిక్తతల నిలయంగా నిలిచిపోయింది. కెనెడీ నుంచి ఒబామా హయాం దాకా అమెరికా అధినేతలంతా ఉత్తర కొరియాను నయాన, భయాన దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అనేక వాణిజ్య ఆంక్షలు విధించి ఉత్తరకొరియాను ఊపిరాడకుండా చేశారు. అభివృద్ధి కుంటుపడటం, వరుసగా ఏర్పడిన కరువు కాటకాలు ఉత్తర కొరియాను పీడించాయి. దీంతో తిరుగుబాటు తలెత్తక ముందే సర్దుకోవాలనే ఆలోచన ప్రస్తుత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లో తలెత్తింది. అమెరికాకు ఎదురొడ్డి నిలిచేకంటే, రాజీతో రాణించవచ్చనే ఆలోచనకు అంకురార్పణ జరుగటానికి కారణమైంది. ఈ రకంగా దేశాన్ని వాణిజ్యంగా ముందుకు తీసుకుని వెళ్లడం ద్వారా ప్రజల్లో భరోసా కల్పించేందుకు కిమ్‌ చేసిన యత్నాలు ఫలించాయనే చెప్పాలి. మొత్తంగా ఈ వ్వయహారమంతా ప్రపంచానికి ముడిపడివున్నదున ప్రపంచ ప్రజలు కూడా శాంతిని ఆహ్వానించారు.