ప్రభుత్వ కట్టడాలకు కేటాయించిన ఇసుకను తరలించాలి:ఎజెసి

కాకినాడ, జూలై 11,: వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వ కట్టడాల నిమిత్తం నదీ గర్భం ద్వారా ఇసుక కేటాయించడం జరిగిందని, దానికి సంబంధిత సొమ్ము చెల్లించి వెంటనే తరలించాలని అదనపు జాయింట్‌ కలెక్టర్‌ బి రామారావు ఆయా శాఖల అధికారులను కోరారు.ప్రభుత్వ కట్టడాలకు ఇసుక కేటాయింపుపై ఆయన మాట్లాడుతూ శాఖల వారీగా ప్రభుత్వ కట్టడాలకు అవసరమైన ఇసుకను ఇరిగేషన్‌, గనుల శాఖలు సంయుక్తంగా నదీ గర్భం ద్వారా ఇసుక కేటాయించడం జరిగిందని ఆయా శాఖలు వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన తెలిపారు. డబ్బు చెల్లించిన వారికి ఇసుక అవసరమైన శాఖలు వెంటనే డిడి రూపంలో సొమ్ము చెల్లించి, వివరాలు అందిస్తే వారికి ఇసుక కేటాయించడం జరుగుతుందన్నారు. ఇసుక లేక పనులు నిలిపివేసిన ఇంజనీరింగ్‌ అధికారులు వెంటనే ఇసుకను తరలించి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్‌ ఎస్‌ఇ, గనుల శాఖ ఎడి అవసరమైన అనుమతులను అందజేస్తారని, సంబంధిత శాఖ అధికారితో, కాంట్రాక్టర్‌ కూడా ఈ అనుమతులపై సంతకం చేసి ఇసుకను తరలించాలన్నారు. ఏ నిర్మాణ పనుల నిమిత్తం, ఏ ప్రాంతానికి ఇసుక తీసుకుని వెళ్లేది ఖచ్చితమైన వివరాలు తెలియజేయాలన్నారు. మున్సిపాల్టీ, కార్పొరేషన్లు కూడా వెంటనే డిడిలు చెల్లించి ఆయా పనుల నిమిత్తం ఇసుకను తరలించాలన్నారు. పనులకు అంతరాయం లేకుండా ఇసుక తరలింపునకు అనుమతివ్వడం జరిగిందన్నారు.