ప్రమాద నివారణ నిబంధనలు పాటించని

సంస్థలపై కఠిన చర్యలు : మంత్రి డి.కె. అరుణ
హైదరాబాద్‌, ఆగస్టు 16 : కనీస ప్రమాద నివారణ, భద్రత నిబంధనలు పాటించకుండా సంస్థ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు చేపడతామని సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి డి.కె. అరుణ అన్నారు. బుధవారం షాద్‌ నగర్‌ సమీపంలో స్టెమ్‌కోర్‌ అల్లాయిస్‌ అండ్‌ ఇస్మాత్‌ లిమిటెడ్‌ ఐరన్‌ పరిశ్రమలో ఫర్నేస్‌ పేలిన ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను గురువారం మంత్రి అరుణ ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిని శాసనసభ్యుడు ప్రతాపరెడ్డితో కలిసి సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి క్షతగాత్రులతో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని సంబంధిత డాక్టర్లతో మాట్లాడి తెలుసుకునానరు. బాధితులకు మెరుగైన వైద్యం అందించవలసిందిగా ఆమె తెలిపారు. డాక్టర్‌ సుదర్వన్‌ వివరిస్తూ ఆసుపత్రికి వచ్చిన 8మంది క్షతగాత్రులలో నలుగురు చనిపోయారని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సెలవు రోజున పనిచేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని అక్కడికి వచ్చిన లేబర్‌ ఆఫీసర్‌ను మంత్రి నిలదీశారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇకముందు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఈ సంఘటనలో మరణించిన వారికి 5 వేలు ఎక్స్‌ గ్రేషియా ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. మొదట హాస్పటల్‌ ఆర్‌.ఎం.ఓ రఫి, డాక్టర్‌ వరలక్ష్మి, సూపరిటెండెంట్‌ రామదాసు క్షతగాత్రుల గురించి మంత్రికి వివరించారు.