ప్రశాంత దర్శనం కల్పించడంలో టిటిడి విఫలం
నిరంతరం విఐపిల సేవలో తరిస్తున్న అధికార గణం
తిరుమల,మే18(జనం సాక్షి): తిరుమల శ్రీవారిని దర్శించుకుని పునీతం కావాలని, జీవితంలో ఒక్కసారయినా ఆ భాగ్యం దక్కించు కోవాలని కలలు కనేవారు ఎందరో..వీరంతా వ్యవప్రయాలకోర్చి తిరుమలకు వచ్చి దర్శనం కోసం పడిగాపులు కాయడం షరామామూలుగా మారింది. ప్రతిరోజూ శ్రీవారిని ఎంతమంది దర్శించుకోగలరో ఖచ్చింతంగా తిరుమల అధికారుల వద్ద లెక్క ఉంటుంది. మామూలు రోజుల్లో కూడా ఎంతమంది దర్శనం చేసుకోగలరో చెప్పగలరు. ఆర్జిత సేవలు, విఐపి సేవలు పోను ఎంత సమయం మిగలగలదు..ఎంతమందికి దర్శనం చేయించగలమన్నది కూడా చెప్పవచ్చు. అయినా ఏ రోజు కూడా స్వామి దర్శనం సజావుగా సాగదు. దైవదర్శనం కోసం వచ్చే వారిని క్యూ లైన్లలో తోస్తూ ప్రశాంతత లేకుండా చేయడం నిత్యకృత్యమే. అటు ఆకలిదప్పులు.. ఇటు తోపులాటల మధ్య దర్శనం అయ్యిందా అంటే అదీ లేదు. తిరుమల శ్రీవారు ఉన్నదే విఐపిల కోసం అన్నట్లుగా ధర్మకర్తల మండలి, అధికారులు వ్యవహరిస్తున్నారు. కోట్లలో భక్తుల నుంచి వితరణలు వస్తున్నా సామాన్యలకు మాత్రం తిరుమల శ్రీవారి దర్శనం దుర్లభం చేస్తున్నారు. ఇక బ్ర¬్మత్సవాలు, పర్వదినాల్లో స్వామి దర్శనం కోసం వేలాది మంది వేల కిలోవిూటర్ల దూరం నుంచి వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి అంటే ఇక చెప్పనక్కర్లేదు. ముక్కోటి రోజు శ్రీవారి దర్శనం పరమపుణ్యం అని భావించి స్వామి చెంతకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఏకాదశి, ద్వాదశి దర్శనాల్లో స్వామివారి చెంత ఉండి, ఆయన సన్నిధిలో ఉంటూ దర్శనం చేసుకునే భాగ్యం పొందాలనుకున్న వారు తిరుమలకు వస్తూనే ఉన్నారు. దీనికితోడు టిటిడి భారీ ఏర్పాట్లు చేసిందని, సామాన్యులకే ప్రాధాన్యం అని చేస్తున్న ప్రకటనలతో సామాన్యుల్లో ఆశ కలిగి, తిరుమలకు చేరుకుని ఇక్కట్ల పాలవుతున్నారు. వైకుంఠ ఏకాదశి,ద్వాదశి రోజుల్లో ఎంతమందికి అవకాశం ఉంటుందో ముందే చెప్పగలం. విఐపిలకు ఎంత సమయం కేటాయించారో..మిగతా సమయంలో ఎందరు సామాన్య భక్తులకు దర్శన అవకాశం ఉంటుందో కూడా చెప్పగలం. అయినా టిటిడి అధికారులు మాత్రం ఇవేవిూ పట్టించుకోకుండా, భారీగా ఏర్పాట్లు చేశామని…సామాన్యులకే అవకాశమని చెప్పి లక్షలాదిమందిని తిరుమలకు రప్పించి వారిని అగచాట్లకు గురిచేస్తున్న తీరు క్షంతవ్యం కాదు. ఏటా ఇది జరుగుతున్న తంతే. అయినా టిటిడి అధికారుల్లో మార్పు రావడం లేదు. చలిలో వారిని ఇక్కట్ల పాల్జేసి చివరకు దర్శనం కలిగించలేమని చేతులెత్తేయడం ఏటా చూస్తూనే ఉన్నాం. ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించినా సమాధానం రాదు. తితిదే యంత్రాంగం చేతులెత్తేసి దర్శనం కల్పించలేమని చెప్పడం బాధ్యతారాహిత్యం తప్ప మరోటి కాదు. ఇకపోతే దేశంలో ఉన్న విఐపిలంతా వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలకు తిరుమలకు వచ్చి చేరుతారు. వీరికి సామాన్యులు పట్టరు. దాదాపు నాలుగు గంటలు వీరి సేవల్లోనే అధికారులు తరిస్తారు.వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో ఎంతమంది భక్తులకు అవకాశం ఉంటుందో అంతమందికే టోకెన్లు ఇచ్చే పద్దతి రావాలి. లేదా అంతమందినే కొండపైకి అనుమతించాలి. విఐపిలకు
నాలుగు గంటలు పోతే మిగిలిన పది లేదా 12 గంటల్లో ఎంతమంది దర్శనం చుసుకుంటారో లెక్కకట్టి అంతమందినే అనుమతించేలా ఏటా ఎందుకు ప్రణాళిక చేయలేకపోతున్నారో ధర్మకర్తల మండలి,టిటిడి ఇవో, జెఇవో తదితరులు సమాధానం ఇచ్చుకోవాలి. ఇకపోతే రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పెట్టినా, రద్దీ లేకున్నా తోసేస్తూ ముందుకు జరపడం అలవాటు చేసుకున్నారు. స్వామి దర్శనం సంగతేమో కానీ లోపల తోస్తున్న తీరు అవమాకరంగా ఉంటోంది. కొత్త ఆలోచనలు చేయడం లేదు. ఈ అవస్థలు గమనించి పరిమిత సంఖ్యలో భక్తులు వచ్చేలా… తిరుమలకు చేరుకుంటే ఖచ్చితంగా స్వామి దర్శనం ప్రశాంతంగా అవుతుందన్న రీతిలో ప్రణాళిక రూపొందించకుంటే తోపులాటల్లో ప్రాణాలు పోయే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఇందుకు మార్పులు అవసరం. మార్పుల అన్నది భక్తులను దృష్టిలో పెట్టుకుని సాగాలి.