ప్రైవేట్‌ పాఠశాల దోపిడీ ఇంకెన్నాళ్లు?

ప్రభుత్వాలు మారినా, కఠిన చర్యలకు ఉపక్రమించినా ప్రైవేట్‌ పాఠశాల్లలో దోపిడీ ఆగడం లేదు. ప్రధానంగా రెండు రకాల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒకటి ఫీజుల దోపిడీ కాగా..రెండోది శ్రమశక్తి దోపిడీ. ఫీజలును వైట్‌,బ్లాక్‌గా తీసుకుంటున్నారు. భారీగా డొనేషన్లు గుంజు తున్నారు. దీంతో ఫీజుల నియంత్రణ అన్నది లేకుండా పోయింది. ఎల్‌కెజిలోనే అరలక్షకు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. ఇకపోతే ఉపాధ్యాయాఉలు రోజంతా కష్టపడుతున్నా వారికి ఇచ్చేది కేవల ఐదువేల నుంచి 12 వేలకు మాత్రమే. సెలవులు అంతంతమాత్రమే. ఇటీవల సమ్మర్‌ హాలిడేస్‌ కూడా కేవలం పదినుంచి 15రోజులు మాత్రమే ఇచ్చారు. మరోవైపు వారిని ఇంటింటికీ తిప్పి అడ్మిషన్ల టార్గెట్‌ విధించారు. ప్రధానంగా మహహిళా టీచర్లు వృత్తిగతమైన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా టీచర్లు తీవ్ర ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రధానంగా నిద్రలేమి, గుండెసంబంధ వ్యాధులు, వెన్నముక సమస్యలను ఎదుర్కొటున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో విద్యారంగ పటిష్టతకు పాటుపడుతూ సామాజిక సేవ చేస్తున్న ప్రైవేట్‌ టీచర్లు అనేక వృత్తిగతమైన ఇబ్బందులు ఎదుర్కొటున్నారని ప్రైవేట్‌ పాఠశాలల టీచర్లు వాపోతున్నారు. పెద్ద బాధ్యతను మోస్తున్న టీచర్లు అంతకుమించిన సమస్యలనూ భరిస్తున్నారు. పనిగంటలు పెంచి, ఇతర పనులను కూడా విధుల్లో చేర్చి ప్రైవేట్‌ టీచర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అసలే అరకొర జీతాలు ఇస్తూ, మరోవైపు అన్ని పనులు నెత్తిన వేస్తూ ఎదురు చెప్పితే ఉద్యోగాలు ఉండవని యాజమాన్యాలు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయి. జీతాల చెల్లింపుల్లోనూ యాజమాన్యం వివక్ష చూపుతోంది. దీంతో పనుల ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్య సమస్యలను భరించాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా టీచర్లు ఉంటే వారిలో సగం మంది మహిళా టీచర్లు ఉన్నారని అంచానా. ఓ వైపు పాఠాలు చెబుతూ, పాఠశాలల్లో రాత పనులు చేస్తూ క్లర్క్‌గా, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు క్యాన్వాసింగ్‌ కూడా చేస్తూ ప్రచారకర్తలుగా బహుముఖంగా పనులు నిర్వహించడం ఏటా జరగుతోంది. తప్పని పరిస్థితిలో ఉద్యోగం చేయడానికి ప్రైవేట్‌ లేడీ టీచర్లు అన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఇకపోతే ప్రైవేట్‌ టీచర్ల ఉద్యోగ భద్రత గాలిలో దీపం లాంటిదని, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఊడిగం చేస్తున్న ఉద్యోగభద్రత లేదంటున్నన్నారు. ఉదయం 8గంటలకన్నా స్కూళ్లో విధులకు వెళితే ఇంటికి చేరే వరకు సాయంత్రం మళ్లీ 8 అవుతోంది. స్కూళ్లోనే 6వరకు విఇధ పనులను పురమాయిస్తున్నారు. దీంతో అభద్రతా భావంతో ప్రైవేట్‌ టీచర్‌ కొట్టుమిట్టాడుతున్నాడు. విద్యాహక్కు చట్టం ప్రకారం యాజమాన్యం ఆదాయంలో 15 శాతం డబ్బును ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కేటాయించాలి. పి.ఎఫ్‌, వైద్య, ఇతర సదుపాయాల నిమిత్తం కేటాయించాలి. కాని యాజమాన్యాలు నిబంధనలకు పాతర వేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నాయి. వేల రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ ఫీజుల పేరుతో యాజమాన్యాలు వసూళ్లు చేస్తూ ఖజానా నింపుకుంటున్నా, టీచర్ల ఆరోగ్యం కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. వారిక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లాంటి పాలసీలు అమలు కావడం లేదు. దీంతో ఏదైనా జబ్బు వస్తే ప్రైవేట్‌ ఆస్పత్రులకు అప్పులు చేసి కట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళా టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల సాధారణ సమయాలతో పాటు ప్రత్యేక తరగతుల పేరుతో గంటల కొద్దీ క్లాసులు ఏర్పాటు చేయడంతో మహిళా ఉపాధ్యాయులు శారీరక సమస్యలకు గురవుతున్నారు. గంటలతరబడి నిలబడి బోధన చేయడం, ¬ంవర్క్‌ చేయించడం, అదేపనిగా నోట్‌ బుక్స్‌తో కుస్తీపట్టడం, చాక్‌పీస్‌ ధూళి కారణంగా వీరుసమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోకపోవడం, పని ఒత్తిడి తగ్గించుకోకపోవడం కారణంగా 40 ఏళ్లల లోపే అనేక ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవేవిూ పట్టించుకోని యాజమాన్యాలు వారిపై ఒత్తిడి పెంచి పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రైవేట్‌ టీచర్లకు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన సెలవుల్లోనూ యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయి. పాఠశాల ఆస్తులను పెంచుకుంటున్న యాజమాన్యాలు టీచర్ల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కూడా చట్టాలు చేయాల్సి ఉంది. ప్రైవేట్‌ యాజామాన్యాలు కోట్లు సంపాదిస్తూ టీచర్ల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నా కార్మిక శాఖ పట్టించుకోవడం లేదు. వారికి కనీస హక్కులు కల్పిస్తున్నారా లేదా అన్నది పట్టించుకోవడం లేదు. ప్రత్యేక తెలంగాణలో కూడా ప్రైవేట్‌ స్కూళ్లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. వారికి ఓ పద్దతి అంటూ లేకుండా పోయింది. నిబంధనల మేరకు నడుచుకోకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా, ఫీజులు గుంజుతూ, టీచర్లను శారీరకంగా మానసికంగా వేదిస్తున్నా యాజమాన్యాలు కోట్లు గడిస్తున్నాయి. అందమైన ప్రకటనలతో అందలమెక్కుతున్నారు. తమ ఉన్నతికి కారణమైన టీచర్ల సంక్షేమాన్ని విస్మరించారు. నిరుద్యోగ సమస్యను ఆసరా చేసుకుని ఉన్నతవిద్యావంతులైన వారిని దోపిడీ చేస్తున్న తీరు ప్రజాస్వామ్యం లో మన కళ్ల ముందు కనిపిస్తున్నా కార్మికశాఖ, విద్యాశాఖ చోద్యం చూస్తుందే తప్ప ప్రశ్నించడం లేదు. దీనిపై పోరాడుతున్న లేదా ప్రశ్నిస్తున్న టీచర్లను తొలగించుకోవడం ద్వారా సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. శ్రమదోపిడీపై నిలదీయాల్సిన అసవరాన్ని ప్రభుత్వం గుర్తించకపోతే సమస్య మరింత తీవ్రం కావడం ఖాయం.