ప్రైవేట్ మాఫియాకు ముకుతాడు పడాల్సిందే
ప్రైవేటు విద్యాసంస్థలు రానురాను ఓ మాఫియాలాగా తయారయ్యాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రైవేట్ విద్యాసంస్థల్లో లేదని చెప్పడం చట్టవ్యతిరేకమైన చర్యగానే గుర్తించాలి జలగల్లా విద్యార్థుల తల్లిదండ్రలు నుంచి ఫీజులు, ఇతర రకాల్లో డబ్బులు గుంజుతూ వేలకోట్లు ఆర్జిస్తున్న వారు మాఫియాలాగా వ్యవహరిస్తామంటే కుదరదు. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా ప్రభుత్వంలో పెత్తనం చేస్తున్నారు. వేలకోట్ల టర్నోవర్‌తో ప్రభుత్వాలను శాసించే దిశగా చేరుకున్నారు. ఇటీవల ఫీజు రియంబర్స్‌మెంట్ వ్యవహారంలో అనేక కాలేజీలు అడ్డంగా దొరికిపోయాయి. లక్షల్లో ఫీజులు గుంజుతూ రకరకాల ఫీజులను వసూలు చేస్తూ పీల్చిపిప్పి చేస్తున్నాయి. వసతులు ఉండవు. అధ్యాపకులు ఉండరు. సరైన లెక్కా పత్రాలుఉండవు. అయినా వారిని ఏవిూ అనడం కానీ, లేదా తనిఖీలు చేయొద్దు..అన్న షరతు పెట్టుకున్నారు. నిజానికి వారిదంతా పారదర్శకత అయితే ఎందుకు ఇలా వ్యవహరిస్తారు. టెట్, ఎంసెట్ పరీక్షలను బహిష్కరించాలని ప్రైవేటు విద్యాసంస్థలు నిర్ణయించుకోవడం శోచనీయం కాక మరోటి కాదు. ఇది ముమ్మాటికి సామాజిక బాధ్యతను విస్మరించడమే గాకుండా జాతి వ్యతిరేక చర్యగానూ గుర్తించవచ్చు. లక్షలాది మంది విద్యార్థులు, వేలాదిమంది తల్లిదండ్రులను క్షోభకు గురిచేసే యత్నం తప్ప మరోటి కాదు. డబ్బు మదంతో తీసుకున్న నిర్ణయంగానూ దీనిని భావించాలి. ప్రజల నుంచి డబ్బులు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వానికి లోబడి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. విచ్చలవిడి నిర్ణయాలతో సమాజంలో పరోక్ష అధికార కేంద్రంగా ఉండాలనుకుంటున్న వారు తమ బాధ్యతా రాహిత్యాన్ని ప్రభుత్వంపై రుద్దరాదు. ప్రభుత్వం అడిగిన లెక్కలు చెప్పకుండా తప్పించుకోజాలరు. అందుకే తెలంగాణలో సిఎం కెసిఆర్ కొంచెం కటువుగానే ఉన్నారు. వారు తెగిస్తే ఊరుకునేది లేదని గట్టిగానే చెప్పారు. ఇంతకాలం తమదే పెత్తనం అన్న రీతిలో ప్రభుత్వాన్ని ఎదరించడం అలవాటు చేసుకున్న విద్యాసంస్థ యాజమాన్యాలు తొలిసారి ప్రభుత్వం నుంచి గట్టి సమాధానం ఎదుర్కోబోతున్నారు. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురువుతుందని ఊహించి ఉండరు. లేకుంటే టెట్, ఎంసెట్ లాంటి పరీక్షల సమయంలో సహకరించమంటూ మెలిక పెట్టడం సర్కార్‌కు సవాల్ విసరడం కాక మరోటి కాదు. ఇది ఓ రకంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే గాక మరోటికాదు. ఇంతకాలం ఏది చేసినా నడిచిందేమో కానీ ఇకముందు బెదరింపులు నడవవని సిఎం కెసిఆర్ గట్టిగా చెప్పడం ద్వారా వారి ఆగడాలకు ముకుతాడు వేసే ప్రయత్నం చేశారు. ఎక్కడో ఒకచోట ఇలాంటి వారికి ముకుతాడు పడాల్సిందే. పరీక్షలు ఆలస్యం అవుతాయేమో కానీ సిఎం కెసిర్ తీసుకున్న నిర్ణమే సరైనది. మాఫియాలా తయారైన ఈ ముఠాను ఎదిరించకపోతే, విద్యపేరుతో విద్యార్థుల తల్లిదండ్రలును మరింతగా పీల్చి పిప్పి చేస్తారు. ఫీజురియంబర్స్‌మెంట్ పేరుతో ప్రభుత్వ డబ్బును దోచుకోవడానికి అలవాటు పడ్డ ప్రాణాలు సామాజిక సేవను, బాధ్యతలను విస్మరించారు. ఇలాంటి వారు పారదర్శకంగా పనిచేసేలా చట్టాల చట్రాలను బిగించాల్సిందే. అందుకే ప్రైవేటు విద్యాసంస్థల బెదిరింపులకు లొంగేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగానే హెచ్చరించారు. అంతేనా అంటే ఆయా విద్యాసంస్థల్లో తనిఖీలు జరిగి తీరుతాయని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో నిర్వహించాల్సిన టెట్, ఎంసెట్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ విద్యాసంస్థల ఐకాస ప్రకటించి విసిరిన సవాల్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడ్డారు. టెట్, ఎంసెట్‌లను తాత్కాలికంగా వాయిదా వేసేందుకు కూడా వెనకాడలేదు. ఈ రెండు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 1న టెట్, 2న ఎంసెట్ జరగాల్సి ఉంది. వీటిని మే 20వ తేదీలోగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది పర్యవేక్షణ, సహకారంతో నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వెనువెంటనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సీఎం కోరారు. పరీక్షల వాయిదాతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కూడా సీఎం భరోసానిచ్చారు. దీంతో ఒకట్రెండు రోజుల్లో పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రైవేటు విద్యా సంస్థల సంఘం నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వారి తీరును ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తరుణంలో సిఎం కెసిఆర్ పాతమూస పద్దతిలో నడవాలని కోరుకోవడం లేదు. పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ విద్యాసంస్థలను ఏరివేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే విషయాన్ని నిర్మొహమాటంగానే చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల ఐకాసగా చెప్పుకుంటున్న వారు తనిఖీలు వ్యతిరేకించడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో, అనేక సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు విద్యా సంస్థలో తనిఖీలు కొనసాగుతాయని కూడా హెచ్చరించారు. విద్యా సంస్థల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసమో, ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఐకాసా నేతలు చెప్పాలి. విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలు అంటూ తప్పుడు ప్రచారం మానుకోవాలి. అవేవిూ రెడ్‌లైట్ ఏరియాలో లేవు. విద్యాసంస్థల్లో అక్రమాలు ఉంటే చర్య తీసుకోవాల్సిందే. బోగస్ విద్యాసంస్థల భరతం పట్టేందుకు విజిలెన్స్ తనిఖీలు చేపటట్‌ఆలన్న నిర్ణయం సరైనదే. ఇందుకు సిఎం కెసిఆర్ అభినందనీయుడు.