ఫీజుల దోపిడీపై నోరుమెదపని ప్రభుత్వాలు

చుక్కారామయ్య అంటే విద్యారంగంలో మంచి పేరున్న అధ్యాపకుడు. ఆయన ద్వారానే ఐఐటి సాధనకు మార్గాలు ఏర్పడ్డాయి. ఆయన తరవాతనే పలువురు ఐఐటి కోచింగ్‌ సెంటర్లు పెట్టారు. ఇటీవల ఆయన ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దోపిడీ ఒక్క హైదరాబాద్‌కు పరిమితం కాదు. ఇది తెలంగాన, ఎపిల్లో స్కూళ్ల ఫీజుల దోపిడీకి సంబంధించిన వ్యహారంగా గుర్తించాలి. హైదరాబాద్‌ నాలెడ్జి హబ్‌ కాదని, దోపిడీకి అడ్డాగా మారిందని చుక్కా రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.  విద్యా వ్యాపారం ప్రజాస్వామ్యానికి దెబ్బ అని పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చినా ప్రభుత్వం కళ్లు తెరవడంలేదని చుక్కా రామయ్య మండిపడ్డారు.ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఇటీవల ఇందిరాపార్క్‌ వద్ద భారీ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రులను కస్టమర్లుగా చూస్తున్నారని, ఫీజుల వసూళ్లను వ్యాపారంగా చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. పిల్లల ఫీజులను పెట్టుబడిగా పెట్టి మంత్రుల పదవులను కొంటున్నారని వ్యాఖ్యానించారు. మధ్య తరగతి ప్రజలను రోడ్డెక్కించిన ఘటన ఈ ప్రభుత్వాల దేనని మండిపడ్డారు. విప్లవం ఎంతో దూరంలో లేదన్నారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్లు దిగిరావాలని, స్కూల్‌ కమిటీలో తల్లిదండ్రులకు చోటు కల్పించాలని డిమాండ్‌ చేశారు.  విద్యార్థుల తల్లిదండ్రులవి గొంతెమ్మ కోర్కెలు కావని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు లేదని చెప్పారు. ప్రైవేటు ఇన్‌స్టిట్యూషన్లన్నీ మంత్రుల చేతుల్లోనే ఉన్నాయని అలాంటివాళ్లు ఉన్నంతకాలం విద్యా వ్యవస్థలో మార్పురాదని చుక్కా రామయ్య స్పష్టం చేశారు. నిజంగానే కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా విద్యావ్యాపారంలో ఆరితేరారు. వారంతా ప్రభుత్వంలో ముందూవెనకా ఉండి నడుపుతున్నారు. తెలంగాణలో ఓ మంత్రికి ప్రముఖ విద్యాసంస్థలు అనధికారిక వాటా చెల్లిస్తున్నాయన్న ప్రచారం ఉంది. దీనిపై ఎక్కడ పోయినా బాహాటంగానే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ వస్తే దోపిడీ పోతుందని భావించిన తరుణంలో ఓ మంత్రి ఇలా వాటాలు పుచ్చకుని వారికి వత్తాసు పలికితే అంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండబోదు. ఫీజుల దోపిడీతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. పిల్లల భవిష్యత్‌ విూద కోటి ఆశలు పెట్టుకుంటున్న పేరెంట్స్‌ వీక్‌నెస్‌ను క్యాష్‌ చేసుకుంటూ బహిరంగ వ్యాపారం చేస్తున్నారు.  అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నా ప్రభుత్వాల్లో కదలిక రావడం లేదు. రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా తెలుగు రాష్టాల్ల్రో చర్యలు తీసుకోవడం లేదు. కారణం వీరి ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించడమే అ/-నది బహిరంగ రహస్యం.  విద్యను బిజినెస్‌గా మార్చుకుంటున్న ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాలపై పేరెంట్స్‌ అసోసియేషన్‌ పోరాటానికి మేధావులు  మద్దతు పలికినా ప్రభుత్వాలు మాత్రం గుర్తించడం లేదు.   మిడిల్‌ క్లాస్‌ పేరెంట్స్‌ ముక్కుపిండి మరీ తమ ఖజానా నింపుకుంటున్నాయి. ఎల్‌కేజీ, యూకేజీ చదువులకే స్కూల్‌ ఫీజు , అడ్మిషన్‌ ఫీజు, ట్యూషన్‌ ఫీజు అంటూ నిలువు దోపిడీ చేస్తున్నాయి. అంతటితో ఆగుతున్నాయా అంటే అదీ లేదు. చిన్నారులను బడిలో చేర్చాక స్కూల్‌ యాజమాన్యాలు నోట్‌ బుక్స్‌, టెక్స్‌బుక్స్‌ అంటూ స్కూల్‌లోనే పక్కా బిజినెస్‌ చేస్తున్నాయి. దీంతో పిల్లలకు టెన్త్‌ క్లాస్‌ ముగిసే సమయానికి తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఫీజు వసూలు చేయడంలో ఒక్కో స్కూల్‌ది ఒక్కో స్టైల్‌. స్కూల్‌ను బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. గల్లీ కన్పించే స్కూల్‌వైతే ఓ రకం ఫీజు, కార్పొరేట్‌ స్కూల్‌లలో అయితే మరోరకం ఫీజు, ఇక టెక్నో, కాన్సెప్ట్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్‌లకైతే స్కూల్‌నేమ్‌కు ముందో వెనుకో ఓ తోక తగిలించి ఫీజులను రెట్టింపు చేస్తున్నాయి. కేవలం తల్లిదండ్రుల బలహీనతను అడ్డంపెట్టుకునే కోట్లు దండుకుంటున్నాయి. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేవారే లేకపోవడంతో ఇష్టానుసారం ఫీజులు పెంచి తల్లిదండ్రుల కష్టాన్ని దోచుకుంటున్నాయని, ఈ దశలో ప్రభుత్వాలు  చేతలుడిగి చూస్తున్నాయి.  ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల ఫీజు దోపిడీపై తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదు. అప్పటికప్పుడు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టినా అది కొన్నాళ్లకే పరిమితమవుతుంది. మరోవైపు ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు ముట్టజెప్పే లంచాలకు అలవాటు పడి అధికారులు చర్యలు తీసుకోవడం మానేశారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ చదువుల వ్యాపారానికి ఎప్పటికైనా అడ్డుకట్ట పడాలని కోరుకుంటున్నారు. ఏ సమాజంలోనైనా ప్రాథమిక విద్యావకాశాలు, అక్షరాసత్య పెరగకుండా ఆ సమాజంలో విజ్ఞానం విస్తరించటం అనేది జరగని పని. విద్యను ప్రతి వ్యక్తికీ అందుబాటులోకి తీసుకొని రావలసిన ఆవశ్యకత ఉన్నది. ఉన్నత విద్యను సాధ్యమైనంత వరకూ పేద వర్గాలకు చౌకగా లభించే విధానాన్ని ఆచరించాలని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో ఆయన ఆశించిన మార్గంలో మన పాలకులు నడవటం లేదు. రాజ్యాంగంలో ఆయన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని రాశారు. అందరికీ అందుబాటులో విద్యను ఉచితంగా అందించిన నాడే ఈ సమాజం విజ్ఞానంతో పరిఢవిల్లుతుందని ఆయన భావించారు. కానీ ఆయన జయంతిని పోటీలు పడి నిర్వహించిన పాలకులు ఆయన ఆశయాలను తుంగలో తొక్కుతూ ప్రయివేటు కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో విద్యను అంగడి సరుకుగా మార్చారు. పేదవాడికి అందాల్సిన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి, రేషనలైజేషన్‌, క్లస్టర్‌ విధానం… అంటూ రకరకాల పేర్లతో నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు విద్యకు మాత్రం ఎర్ర తివాచీ పరవడం బాధాకరం.