‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వద్దు… కళాశాలలను ఏర్పాటు చేయండి’

కడప, ఆగస్టు 3 : వృత్తి విద్యా కళాశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్‌ చేశారు. విద్య, వైద్య కళాశాలలను ప్రైవేటికరణవైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థల నిర్లక్ష్యం, నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ చర్యలున్నాయని ఆయన ఆరోపించారు. కడపలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. విద్య, వైద్య రంగాలను సక్రమంగా నడపడంలో ప్రభుత్వం విఫలం చెందిన కారణంగానే ఈ కళాశాలల్లో సంక్షోభ పరిణామాలు ఏర్పడ్డాయని అన్నారు. ఇంజనీరింగ్‌ కళాశాలలో నేటికీి విద్యార్థులకు ప్రవేశం కల్పించకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బదులుగా ప్రభుత్వమే కళాశాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలకు సౌకర్యాలు లేని కారణంగానే అనుమతులు రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఐదు ఆయుర్వేద వైద్య కళాశాలలు ఉండగా తిరుపతి వైద్య కళాశాలకు మాత్రమే అనుమతి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి క్రికెట్‌ ఆడుకోవడం మినహా మరేమీ చేయడం లేదని అన్నారు. సెప్టెంబర్‌లో పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు ఓబులేశు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

తాజావార్తలు