ఫైనల్లో ముంబయి

 

పోరాడి ఓడిన ద్రావిడ్‌ సేన

చెలరేగిన స్మిత్‌

తుది పోరులో గెలిచేదెవరో..!

కోల్‌కతా :

ఐపీఎల్‌-6లో భాగంగా స్థానిక ఈడెన్‌ గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్‌ 2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు పోరాడి ఓడింది. ముంబయి ఇండియన్స్‌ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ నిలకడగా ఆడి 37 బంతుల్లో 43 పరుగులు చేసి ఔటయ్యాడు. హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌లో శర్మకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రెహానే 18 బంతుల్లో 21 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వాట్సన్‌ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక పోయాడు. 8 బంతుల్లో 6 పరుగులు చేసి హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. సామ్సన్‌ రెండు బంతులకే డకౌట్‌ అయ్యాడు. బిన్ని 27, హాడ్జ్‌ 19 (నాటౌట్‌), కూపర్‌ 4, యాగ్నిక్‌ 31 (నాటౌట్‌) పరుగులు చేశారు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి జట్టు మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ స్మిత్‌ చెలరేగి ఆడాడు. 44 బంతుల్లో 62 (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులు చేశాడు. బిన్ని బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి సామ్స్‌న్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తారే 27 బంతుల్లో 35 పరుగులు చేసి చక్కని భాగస్వామ్యం అందించాడు. కూపర్‌ బౌలింగ్‌లో సామ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. శర్మ 2, పొలార్డ్‌ 11, రాయుడు 17, హర్భజన్‌ సింగ్‌ 6 (నాటౌట్‌), ధావన్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. ముంబయి జట్టులో హర్భజన్‌ సింగ్‌ 3, పొలార్డ్‌ 2, మలింగ్‌ ఒక వికెట్‌ తీశారు. రాజస్థాన్‌ జట్టులో కూపర్‌ 2, ఫాల్క్‌నర్‌, వాట్సన్‌, త్రివేది, బిన్ని ఒక్కో వికెట్‌ తీశారు. ఆదివారం జరిగే తుది పోరులో ముంబయి, చెన్సై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఈ జట్టులో గెలిచేదెవరో వేచి చూడాల్సిందే..