బోటుప్రమాదంలో మరో ఐదు మృతదేహాలు వెలికితీత
కొందరి నగదు గోదారిలోనే గల్లంతు
కాకినాడ,మే17(జనం సాక్షి ): బోటు ప్రమాదంలో మరో ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఉంటూరు-వాడపల్లి మధ్య గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 19కి చేరింది. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం మంటూరు వద్ద మంగళవారం సాయంత్రం లాంచీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బోటులో సిమెంటు బస్తాలు తీసుకురావడం ప్రమాదానికి మరో కారణమని తెలిపారు. ఈదురుగాలులు, వర్షం రావడంతో లాంచీని ఒడ్డుకు చేర్చాలంటూ ప్రయాణికులు ఎంత మొత్తుకున్నా లాంచీ డ్రైవర్ వినలేదు. అం తేకాకుండా ప్రయాణికులను సముదాయించేందుకు అందర్ని క్యాబిన్‌లోకి పంపించి తలుపులు కిటికీలు మూసివేశారు. ఫలితంగానే లాంచీ కప్పు పైన కూర్చున్న 15 మంది ఈదుకుంటూ తప్పించుకున్నారు. గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాదంలో దేవీపట్నం మండలంలోని అగ్రహారం నుంచి కొండమొదలు వరకు 20 గిరిజన గ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో గిరిజనులే అధికంగా ఉండటంతో కొండకోనల్లో రోదనలే మిన్నంటాయి. మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగగా రాత్రి నుంచి బుధవారం వరకు గల్లంతైన తమ వారి కోసం బంధువులు గోదావరి ఒడ్డునే నిరీక్షించారు. గోదావరికి అటు, ఇటు వైపు ఎక్కడ చూసినా గిరిజనులు బారులుతీరారు. మధ్యాహ్నం సమయానికి గోదావరి నదిలో గల్లంతైన వారి మృతదేహాలు బయటపడటంతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. లాంచీ ప్రమాదంలో మృతి చెందిన పలువురు గిరిజనులకు సంబంధించిన నగదు గల్లంతైనట్లు వారి బంధువులు తెలిపారు. ఇందుకూరుపేట బ్యాంకు నుంచి కొంత మంది నగదు తీసుకుని తమ వెంట తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామిరెడ్డి రూ.30వేలు నగదు తీసుకుని వెళ్తుండగా మృత్యువాత పడ్డాడు. అతడికి సంబంధించిన పలు బ్యాంకు పత్రాలు లభ్యం కాగా నగదు మాత్రం దొరకలేదు. మరికొంత మంది నగదు గల్లంతైనట్లు తెలుస్తోంది.