మంచితో మనసులు గెలుచుకోవచ్చు
మనం మాట్లాడే మాటలు అమృతం చిలకరించినట్లు ఉండాలే తప్ప,శరాల్లా మనసుల్ని గాయపరచకూడదని పెద్దలమాట. వినసొంపైన మాటే మంత్రంలా పనిచేసి పదిమందినీ దగ్గరకు చేరుస్తుంది. పరుషమైన మాట తన అనుకున్న వాళ్లను దూరం చేస్తుంది. కాగల కార్యాలను అడ్డుకుంటుంది. వినదగునెవ్వరు చెప్పిన- అంటూ మాట్లాడటం కన్నా, వినడంలోనే వినయం ఉందని గురువులు చెబుతారు. మాట్లాడటంలో సమతుల్యత, సంయమనం ఉండాలన్నది అంతర్లీనార్థం. మంచి మాటలు మాట్లాడితే అంతటా, అందరికీ మేలే కలుగుతుంది. చక్కగా మాట్లాడటాన్ని ఓ కళగా చెబుతారు. అరవై నాలుగు కళల్లో వాచకాన్ని చేర్చారు. ఎలాంటి మాటలు పొరపాటునైనా నోటి నుంచి వెలువడకూడదో మన పూర్వీకులు స్పష్టంగా విశదీకరించారు. ఎదుటివారితో కఠినంగా మాట్లాడటం, అసత్యం పలకడం, పితూరీలు చెప్పడం, అసందర్భ ప్రలాపం… వీటికి దూరంగా ఉంటే వాచలత్వాన్ని అదుపు చేసుకున్నట్టే. భగవంతుణ్ని ప్రసన్నం చేసుకునే విధానంలోనూ మాటలదేపైచేయి.మంత్రాలు, శ్లోకాలు అన్నీ కమ్మని, వినసొంపైన మాటల సముదాయమే. బాధలకు తాళలేక కీర్తనల రూపంలో మొరపెట్టుకున్నా పెదవి విప్పని శ్రీరాముణ్ని పలుకే బంగారమాయెనా అంటూ సున్నితంగా నిలదీస్తాడు రామదాసు. అంతేకాక- ననూ బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ అంటూ తగిన సమయం చూసి, తన బాధను రామయ్య మనసు కరిగేలా విన్నవించమని అయోనిజనూ అర్థిస్తాడు. తిలకము దిద్దెరుగా, కస్తూరి తిలకము దిద్దెరుగా కలకలమను ముఖకళ గని సొక్కుచు పలుకులనమృతము లొలికెడు స్వామికి- అంటాడు త్యాగరాజు తన కీర్తనలో. మనసుతో వినగలగాలే కాని భగవంతుడివెప్పుడూ అమృత వాక్కులే!