మంచినీటి సమస్యపై కార్యాచరణ ఏదీ?

రెండు తెలుగు రాష్టాల్ల్రో గతంలో ఎన్నడూ లేనంతగా కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వరుసగా రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రధానంగా ప్రజలకు తాగునీటితో పాటు పశువులకుకూడా తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఈ జిల్లా  ఆ జిల్లా అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. బడ్జెట్‌ సమావేశాల్లో ఇరు రాష్టాల్రకు సంబంధించి కరవుపై చర్చ వచ్చినా కార్యాచరణకు ఎలాంటి ప్రకటనా వెల్లడి కాలేదు. అనవసర అంశాలపై, రాజకీయ అంశాలపై చర్చించిన సభ్యలు తాగునీటి సమస్యపై ప్రధానంగా చర్చించి ప్రభుత్వం నుంచి హావిూని రాబట్టుకోలేక పోయారు. ఎపి అసెంబ్లీలో వైకాపా, తెలంగాణ సభలో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు తమ బాధ్యతను విస్మరించాయి. తాగునీటి సమస్యలపై ప్రధానంగాచర్చ చేయాల్సిన పార్టీల నేతలు వ్యక్తిగత ప్రతిష్టకోసం పోయారే తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్దిని ప్రదర్శించలేక పోయారు. అన్ని జిల్లాలో త్రాగునీటి ఇబ్బందులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. వేసవి ఆదిలోనే ఈ పరిస్థితి ఉంటే నడివేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంకావడం లేదు. ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి త్రాగునీ టి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలిచ్చినా జిల్లాల అధికార యంత్రాంగం వేస్తున్న ప్రణాళికను ఎంతవరకు స్వచ్ఛమైన నీటితో జనం గొంతులు తడపగలవోనన్న సందేహాలు వ్యక్తమవు తున్నాయి. గతేడాది కొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. చెరువులు నిండాయి. కానీ ఆ నిండిన చెరువుల్లో నీరు మాత్రం ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఏళ్ళ తరబడి భూగర్భం ఉడికిపోయి, వచ్చిన నీటిని అ మాంతం మింగేసింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో భూ గర్భ జలాల శాతం అప్పటికి పెరిగింది కానీ, ఈ మధ్యకాలంలో భూగర్భ జలమట్టం క్రమక్రమంగా అ డుగంటిపోతోంది. ఈ నేపథ్యంలో గ్రావిూణ ప్రాంతాల్లో ఇప్పుడే నీటి సమస్య ఎదురవుతోంది. పట్టణ ప్రాంతాల్లో కూడా ఐదు రోజులకోసారి మంచినీరు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ఇక మినరల్‌ వాటర్‌ పేర్లతో పుట్టగొడుగుల్లా వెలసిన ప్లాంట్‌ల యాజమాన్యాలు చుక్కచుక్కకు లెక్కగట్టి జనం నుంచి ముక్కులు పిండి వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో బ్రాండెడ్‌ వాటర్‌ బాటిళ్ల దందా జోరుగా సాగుతోంది. విధిలేక ప్రజలు ఈ నీటిని కొనుక్కుని తాగుతున్నారు. ఇక ఎపి  ప్రభుత్వం స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఎన్టీఆర్‌ జలసిరి పేరుతో అక్కడక్కడ ప్లాంట్‌లు ఏర్పా టు చేసినా అవి సామాన్య ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతాలకు దగ్గరగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అరకొరగా వస్తున్న త్రా గునీటిలో భూగర్భంలోనే కలుషితం ఎక్కువైపోయి గరళాన్ని తలపిస్తోంది. హైదరాబాద్లో అయితే కలుషిత నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. దీనిని పరిష్కరించడంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ అధికారులు విఫలమయ్యారు. అంతేకాదు చాలా పట్టణాల్లో ఉన్న పరిశ్రమలకు సంబంధించిన కాలుష్యపు నీరును నదుల్లోకి తరలించడం, మురికి పదార్థాలను, వ్యర్థ పదా ర్థాలను త్రాగునీటి, బోరు ఉన్న ప్రాంతాల్లో నిల్వ ఉంచడం వలన నీటిలో కాఠిన్యత పెరిగి కాలుష్యపు జలంగా మారిపోతోంది. ఈ నీరు త్రాగిన చాలా మందిలో జీర్ణకోశ వ్యాధులు, శ్వాస కోశ వ్యాధులు అధికమవుతున్నాయి. ఇప్పటికే కలుషిత నీటి వలన కామెర్ల వ్యాధులు పెరుగు తున్నాయి. గ్రావిూణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణ ప్రాంతాల్లోనూ త్రాగునీటి సమస్య జటిలమవుతోంది. జిల్లాల వారీగా వేసవి తీవ్రత, భూ గర్భజల సంరక్షణ, స్వచ్ఛమైన నీటిని సరఫరా వంటి అంశాల పై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించి వా టిని కఠినంగా అమలు చేయడం లేదు. నదులు, చెరువుల్లో విపరీతంగా ఇ సుకను తోడేయడంతో నదీ గర్భాలన్నీ కలుషిత మైపోయాయి. ప్రధానంగా కడప జిల్లాలోని  దాదాపు

సగానికి పైగా గ్రామాల్లో ఇప్పుడే నీటి ఎద్దడి ఎదురవుతోంది. ఇక అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలో కూడా ఈ ఏడాది త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లో పశువులకు నీరులేని పరిస్థితి నెలకొంది. కడప, అనంతపురం, చిత్తూరు, సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో పశువులకు ఇప్పుడే త్రాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందని గ్రావిూణులు వాపోతున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో గొంతులు తడవాలంటే కిలోవిూటర్ల దూరంలో వెళ్ళి గుక్కెడు నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మునిసిపాలిటీలు ,మునిసిపల్‌ కార్పొరేషన్‌లలో ఏ అర్థరాత్రి సమయంలోనో వచ్చే బిందెడు నీళ్ళ కోసం జాగారం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడే నెలకొంది.ప్రభుత్వ యంత్రాంగం వందల కోట్ల రూపాయల నిధులను ఖర్చుచేసి  త్రాగునీటి కోసం ఖర్చు చేస్తున్నా అది కార్యాచరణలో విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి.  చాలా ప్రాంతాల్లో వర్షాభావం ఉన్నా జనం గొంతులు తడపడానికి మాత్రం ప్రభుత్వా లెందుకో నిర్మాణాత్మకంగా వ్యవహరించలే కపోతున్నాయి. ఇప్పటికే నీరు లేక జనం వలసలు పోతున్నారు. ఇక రానున్న రోజుల్లో మరీ గడ్డుప రిస్థితులు ఏర్పడి గుక్కెడు నీటికోసం జనం రోడ్ల పై సిగపట్లు పట్టుకునే పరిస్థితి రానుంది. ఇప్పటికే జలాశయాల్లో నీరు లేదు. ఏదిఏమైనా ప్రభుత్వం జిల్లాల అధికార యంత్రాంగం ఒక స్పష్టమైన ప్రణాళికతో స్వచ్ఛమైన నీటిని ప్రజలకందించి వేసవిలో వారి గొంతులు తడపవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే పశువులు మరణం బారిన పడే ప్రమాదం ఉంది. ఇరు రాష్టాల్ర ప్రభుత్వాలు ఈ రెండు నెలల కోసం కార్యాచరణ చేసి నిధులు విడుదల చేస్తేనే పరిస్థితిని అధిగమించగలం.

——–