మందగించిన మిర్చి కొనుగోళ్లు

నిస్పృహలో రైతులు  
ఖమ్మం,మే8(జ‌నం సాక్షి): మిర్చిమంటలు చల్లారకపోయినా రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లు మంద గించాయి. రైతులు ఎక్కడిక్కడే వ్యాపారులకు పంటను తెగనమ్ముకోవడంతో మార్కెట్‌కు పంట రావడం
ఆగిపోతోంది. ఉన్నదే కొనుగోలు జరగకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం, వరంగల్‌ వ్యవసాయ మార్కెట్లకు తరలివచ్చే మిర్చి సాధారణ రోజుల కంటే సగానికి తగ్గినట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు చెబు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5వేలకు కొనుగోలు చేస్తా మని ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేలు చేయాలని లేఖ రాయడం తెలిసిందే. దీంతో కేంద్రం ధర పెంచుతుందన్న ఆశతోనే రైతులు తమ మిర్చిని మార్కెట్‌కు తీసుకురావడంలేదని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే పెట్టుబడులకు అప్పులిచ్చిన వ్యాపారుల ఒత్తిడితో రైతులు మిర్చిని తక్కువ ధరలకే తెగనమ్ము కున్నారు. ఇప్పటికే 80శాతం పంటను తెగనమ్మారు. అంతేగాకుండా ఆయా జిల్లాల యంత్రాంగం కూడా మిర్చి అధికంగా మార్కెట్లకు రాకుండా కొంతమే రకు నియంత్రించింది. సాధారణంగా ఖమ్మం మార్కెట్‌కు రోజుకు 80వేల నుంచి లక్ష బస్తాల వరకు మిర్చి వచ్చేది. ఇది 40వేల బస్తాలకు పడిపోయిందని అధికారులు తెలిపారు. వరంగల్‌ మార్కెట్‌కు 70 వేల బస్తాలొచ్చే లోడు… 22 వేల బస్తాలకు పడిపోయిందన్నారు. దీంతో
ఖమ్మం మార్కెట్లో కాస్తంత ధర పెరిగింది. అయితే రైతుల వాదన మరోలా ఉంది. మిర్చి తీసుకుని వచ్చినా కొనేనాథుడే లేడని, తక్కువ ధర అంటున్నా ఎలా అమ్మేదని వాపోతున్నారు. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన అన్నదాతలు ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. మార్కెట్లో ఇంత గొడవ జరుగుతున్నా పాలకవర్గం మాత్రం స్పందించ లేదు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. మొత్తంగా మార్కెట్లో ధరలు వస్తాయన్న భరోసా లేకపోవడంతో రైతులు ఇక్కడ పడిగాపులు పడేందుకు రావడం లేదు.
——