మదర్సా విద్యార్థులతో ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ
బిచ్కుంద ఆగస్టు 13 (బిచ్కుంద) స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల పత్లాపూర్ గ్రామంలో శనివారం నాడు చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహ భరితంగా సాగింది. స్థానిక మదర్సా అరబియ ఫైజుల్ ఖురాన్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల విశిష్టతను చాటేలా ఉదయం పది గంటల సమయానికే వందల సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్చందంగా హాజరై ఫ్రీడం ర్యాలీలో భాగస్వాములయ్యారు. గుండెల నిండా దేశ భక్తిని నింపుకుని విద్యార్థులు, యువతీ యువకులు మొదలు వృద్ధుల వరకు కదంకదం కలుపుతూ ర్యాలీలో పాల్గొనడం జాతీయ సమైక్యతకు అద్దం పట్టింది. వందల మంది ర్యాలీలో పాల్గొనడం అందమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ సమానత్వపు చిహ్నానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. సర్పంచ్, ఉప సర్పంచ్, రహీం మౌలానా, హఫీజ్ మోయిన్ అక్బర్, పంచాయతీ సెక్రటరీ సర్ఫరాజ్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.