మానవ మృగాన్ని ఉరి తీయండి

కావలి ప్రజల వేడుకోలు
నెల్లూరు, జూన్‌ 28 : కావలి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన గీతాంజలి పాఠశాల కరస్పాండెంట్‌ మేకల యానాదిరెడ్డి హత్య కావలి వాసులను తీవ్రంగా కలిచివేసింది. హత్యకు పాల్పడిన ఆ మానవమృగాన్ని ఉరి తీయాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఒక ఉన్మాది నుంచి తన కుమార్తెను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో మేకల యానాదిరెడ్డి అకారణంగా ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంత వాసులను తీవ్ర విషాదంలో ముంచడంతో పాటు యానాదిరెడ్డి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మంగళవారం సాయంత్రం ఎస్‌కె రియాద్‌ అనే ఉన్మాది చేతిలో యానాదిరెడ్డి హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్య జరగడానికి దారితీసిన కారణాలను వెల్లడించిన పోలీసులు సైతం జరిగిన సంఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడు రియాద్‌ భోగోలు మండలంలోని బిట్రకుంట ప్రాంతానికి చెందిన వాడు. 22ఏళ్ల వయస్సున్న రియాద్‌ అదే ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. భర్త ఉన్మాదిగా మారడంతో భార్య ఆరు నెలలకే వదిలివెళ్లిపోయింది. రియాద్‌ కావలిలో పగటి పూట అంగళ్లలో గుమాస్తాగా పనిచేస్తూ రాత్రివేళల్లో మారణాయుధాలు ధరించి రోడ్డుపై తిరుగుతూ ఒంటరిగా కనిపించిన మహిళలను కత్తులతో బెదిరించి హత్యాచారం చేసేవాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం కూడా కావలి పట్టణంలోని కో ఆపరేటివ్‌ కాలనీలోగల సాయివేద అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మేకల యానాదిరెడ్డి కుమార్తె అనూజను తనకు ఇల్లు కావాలని కోరాడు. అతని వాలకాన్ని చూసిన ఆమె బయటికి వెళ్లమని తోసేసి లోపల గడియపెట్టుకుంది. రియాద్‌ తలుపును అదే పనిగా కొడుతుండడంతో భయభ్రాంతులైన అనూజ పాఠశాలలో ఉన్న తన తండ్రికి విషయానికి తెలిపింది. సాయివేద అపార్ట్‌మెంట్‌ పక్కనే గీతాంజలి పాఠశాలను నడుపుతున్న మేకల యానాదిరెడ్డి వెంటనే అక్కడి వచ్చి రియాద్‌ చర్యలను అడ్డుకున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన రియాద్‌ తన వద్దనున్న కత్తితో యానాది రెడ్డి గొంతు కోసి తప్పించుకుని పారిపోయాడు. తన తండ్రి అరుపులు విన్న బయటకు వచ్చి చూసే సరికి రక్తపుమడుగులో ఉన్న తన తండ్రిని చూసి భయంతో కేకలు వేసింది. పారిపోతున్న రియాజ్‌ను చుట్టుపక్కల వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తానే మేకల యానాదిరెడ్డిని హత్య చేసినట్టు రియాద్‌ ఒప్పుకున్నాడు. ఇలాంటి సంఘటనలు కావలిలో కొత్తేమి కాకపోయినా ఉన్మాది అకారణంగా ఒక మనిషి ప్రాణాలను నిలువునా తీయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. గతంలో బిట్రకుంట ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఇలానే ఉన్మాదులుగా మారి ఇంటి పెరట్లలో దాక్కువోవడం, మహిళలు బయటకు వచ్చినప్పుడు కత్తులతో బెదిరించి అత్యాచారం చేయడం వంటివి ఇక్కడ జరుగుతున్నాయి. ఆరు నెలలో భోగోలు మండలం కప్పరాళ్లతిప్ప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇలానే బాత్‌రూంలలో దూరి మహిళలను అఘాయిత్యం చేయగా ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు అతనిని పాత నేరస్థుడుగా గుర్తించి జైలుకు తరలించారు. ఆ రోజే ఇలాంటి సంఘటనలపై దృష్టి సారించి ఉంటే ఈ దారుణం పునరావృతం అయ్యేది కాదు. అప్పట్లో సంచలనం కలిగించిన ఉన్మాది విషయంలో ప్రజా సంఘాలు ఆందోళన చేసినప్పటికీ పోలీసులు కనీసం కూడా స్పందించకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అధిక శాతం నేరాలన్నీ కావలి డివిజన్‌లోనే ఎక్కువగా నమోదు అవుతుంటాయి. ప్రత్యేకించి ఉన్మాదుల సంఖ్య ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నా పోలీసులు దృష్టి సారించిన సంఘటనలు చాలా తక్కువ. యానాది రెడ్డి హత్య కేసులో నిందితుడైన రియాద్‌ను ఉరి తీయాలని, ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాంతి భద్రతలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.