మార్కెట్లో ధాన్యం తడిస్తే ఎవరు బాధ్యులు?
ఎండాకాలం ఆరంభంలో మార్చి నుంచి మే వరకు ప్రకృతి ప్రకోపం సహజం. వడగళ్ల వానుల, ఈదురు గాలులు తప్పవు. వీటినుంచి తప్పించుకోవడం మానవ మాత్రులమైన మనకు అసాధ్యం. ఏటా వడగళ్లు, అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటలు నేలరాలుతున్నాయి. అలాగే కల్లాళ్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. లేదా కొట్టుకుని పోతోంది. కోతకు వచ్చిన వరి, మక్కజొన్న పంటలు నాశనం అవుతున్నాయి. మామిడి కాయలు నేలరాలి పంట ధ్వంసం అవుతోంది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాకుండానే నస్టపోవడం రైతు వంతవుతున్నది. ఇదంతా ఒక ఎత్తయితే మార్కెట్లో అమ్ముకుందామని తీసుకుని వచ్చిన ధాన్యం కళ్లముందే వరుణిడి దెబ్బకు తడిసి పోతోంది. వరదల్లా కొట్టుకుని పోతోంది. ఈ రకంగా కూడా అన్నదాతకు నష్టం తప్పడం లేదు. ఓ వైపు చెంపదెబ్బ మరోవైపు గోడదెబ్బలా రైతుల పరిస్థితి మారింది. ప్రకృతి సమయాల్లో ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లుగా ఉంటోంది. ఏటా అకాల వర్షాలు తప్పవని తెలిసినా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రధానంగా మార్కెట్లకు వచ్చిన ధాన్యాన్ని టార్పాలిన్లు కప్పి రక్షించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏటా వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎప్పటికప్పుడు వాతావరణశాఖ హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయినా తాజాగా గురువారం కురిసిన వర్షానికి మార్కెట్లలో ఉన్న ధాన్యం అనేక చోట్ల కొట్టుకుపోవడమో లేదా,తడిసిపోవడమో జరిగింది. దీనిని కూడా సిఎం కెసిఆర్ లేదా మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు పదేపదే చెప్పాలా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. మార్కెట్లోకి వచ్చిన ధాన్యాన్ని కాపాడుకోవడం మార్కెట్ అధికారుల విధి. పొలాల్లో ఉన్న ధాన్యాన్ని, పంటలను ఎలాగూ కాపాడుకోలేం. కనీసం మార్కెట్‌కు చేరిన ధాన్యం నీటిపాలు కాకుండా చోద్యం చూస్తున్న తీరే క్షమించరానిది. వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. వేల సంఖ్యలో ధాన్యపు బస్తాలు తడిశాయి. దాదాపు 4100 హెక్టార్లలో మామిడి పంట నష్టపోయింది. అనేక ప్రాంతాల్లో చేతికి అందివచ్చిన మామిడికాయలు నేలరాలిపోయాయి. పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. అకాల వర్షాలకు పూర్వపు వరంగల్ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. మునుపెన్నడూ లేనివిధంగా రెప్పపాటు వ్యవధిలో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వాన రావడంతో అల్లకల్లోలమైంది.పలుగ్రామాల్లో కల్లాల్లో ఉన్న వరి, మక్కజొన్న ధాన్యపురాశులు తడిసిముద్దయ్యాయి. 55 గ్రామాల్లో సుమారు 1550 ఎకరాల్లో వరి, మక్కజొన్నకు తీవ్రనష్టం వాటిల్లడమే కాకుండా మామిడి నేలరాలిందని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరంగల్ గ్రావిూణ జిల్లాలోని 15 రెవెన్యూ మండలాల్లోని 270 గ్రామాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల్లో వందల ఎకరాల్లో వరిధాన్యం నేల రాలింది. అరటితోటలు విరిగిపడ్డాయి. పసుపు, మిర్చి కల్లాల్లోనే తడిసిపోయాయి. జిల్లాలోని 90 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. 429 హెక్టార్లలో 340 మంది మామిడి రైతులు నష్టపోయినట్లు వ్యవసాయశాఖాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లాలో 212 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మహబూబాబాద్ మార్కెట్లో 200 బస్తాల ధాన్యం, మక్కల బస్తాలు తడిశాయి. కేసముద్రం మార్కెట్‌లో పసుపు, ధాన్యం, మక్కజొన్న సుమారుగా 3 వేల బస్తాలు తడిసిపోయాయి. పెద్దవంగర మండలం అవుతాపురం, చిట్యాలలో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన 2వేల బస్తాల ధాన్యం తడిసింది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర, పాలేరు, వైరాలలోని కొనుగోలు కేంద్రాల్లో కొంత పంట తడిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం,
అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలోని 23 మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. ఖమ్మం మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్న నిల్వలపై టార్పాలిన్ వేసినా కిందిభాగంలోకి నీరు చేరింది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు వరిపంటలు నెలకొరిగాయి. కొల్చారం మండలంలో మామిడి కాయలు రాలిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసి ముద్దయింది. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో వర్షం కురియడంతో వరి ధాన్యం తడిసింది. వేల క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. జిల్లాల్లో యాసంగి పంటలను కొనుగోలు చేస్తున్న ఐకేపీ కేంద్రాల్లో చాలా చోట్ల టార్పాలిన్లు లేక ధాన్యం రాశులు తడిసిపోయాయి. ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, మిరప పంటలు తడిసిపోయాయి. పలు జిల్లాల్లో మామిడితోటలకు నష్టం వాటిళ్లింది. కరీంనగర్ మార్కెట్‌యార్డులో టార్పాలిన్ల కొరతతో ధాన్యం తడిసిపోయింది. రెండురోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని, రైతులు ధాన్యం తీసుకురావద్దంటూ జిల్లా అధికారులు ప్రకటించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి, తిరుమలగిరి, సూర్యాపేట, నకిరేకల్‌లలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు నీటిపాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట, బాలానగర్, నవాబ్‌పేట, దేవర్‌కద్రలోనూ వర్షం భారీగా కురిసింది. బస్తాల కొద్ది ధాన్యం తడిసిపోయింది. కల్వకుర్తి మార్కెట్‌కు వచ్చిన ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా తొగుట, హుస్నాబాద్‌లో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న, వరి పంట తడిసిపోయింది. మొత్తంగా మార్కెట్లలో వేలకొద్ది టన్నలు ధాన్యం రాశులు నీటమునిగాయి. పలుచోట్ల కొట్టుకుపోయాయి. దీనికి కారకులు ఎవరు. మార్కెట్ అధికారుల బాధ్యతారాహిత్యం కాక మరోటి కాదు. సాకులు చెప్పి తప్పించుకోవడం వల్ల రైతులకు నష్టం కట్టివ్వగలరా అన్నది ఆలోచన చేయాలి. మార్కెట్ అధికారులకు పంటను కాపాడుకునే బాధ్యతలు కూడా అప్పగించాలి.
అప్పుడే కొంతయినా నష్టనివారణ జరగవచ్చు. టార్పాలిన్లు లేవనో లేదా గన్నీ బ్యాగులు లేవనో తప్పించుకకోవడం ద్వారా ఏటా ఇలాంటి నష్టాలను ప్రజల నెత్తిన వేయడం తగదు.