మృత్యుదారులు


` వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి
నల్లగొండ, సెప్టెంబరు 19(జనంసాక్షి): రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు సవిూపంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండల పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు.నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలం మద్దిమడుగు సవిూపంలో ఆర్టీసీ బస్సు ? ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మిర్యాలగూడ సవిూపంలోని సూర్యతండా వాసులుగా పోలీసులు గుర్తించారు. మద్దిమడుగు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు దేవరకొండ డిపోకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు సవిూపంలో సంభవించిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం శివారులో ఈ ప్రమాదాలు జరిగాయి. ముత్యాలమ్మగూడెం వద్ద హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.మరో ఘటనలో ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదాల నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్‌ చేస్తున్నారు.