మోడీ హావిూలన్నీ బూటకం
-సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం,మే2( జనం సాక్షి): అధికారంలోకి వస్తే నల్లడబ్బు తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15లక్షలు పంచుతానన్న మోడీ నేటివరకు రూ.15 పైసలు కూడా ఇవ్వలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. జీఎస్టీ, నోట్లరద్దుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. ఈ పాలనను ప్రశ్నించిన మేధావులను చంపేస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వెనుకబాటుకు ఆంధ్రావాళ్లే కారణమని నిందించారని, తెలంగాణ వచ్చిన తరువాత కూడా పరిస్థితుల్లో ఏమార్పులు లేవన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఒక్క పథకాన్ని కూడా చిత్తశుద్ధితో అమలు చేయలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బహుజన రాజ్యం స్థాపన కోసం బీఎల్‌ఎఫ్ 119 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. పేదవాడి కష్టాన్ని కన్నీళ్లలో అర్థం చేసుకొని చేయూతనిచ్చేవాడే కమ్యూనిస్టన్నారు. ఒక్కసారి ఎర్రజెండాను ప్రేమిస్తే చనిపోయేవరకు ఆ ప్రేమపోదని చెప్పారు. గెలుపోటములు కమ్యూనిస్టుకు ముఖ్యం కాదని, పోరాటాలే ఊపిరన్నారు. పోరాటంలో గెలిస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సిపిఎం ఎల్లవేళలా పేదల పక్షాన పోరాడుతుందని అన్నారు.