రాజస్థాన్ అడుగు ముందుకు..
– సన్ రైజర్స్ సంచనాలకు తెర
–ఉత్కంఠ పోరులో రాయల్స్ విజయం
– క్వాలిఫైయర్-2కు..
–ఆదుకున్న బ్రాడ్ హాడ్జ్
ఢిల్లీ : ఐపీఎల్-6లో రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలి ఫైయర్-2కు చేరింది. బుధవారం ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ తడబడుతూ ఆడింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ పటేల్ 3 బంతులు ఆడి ఒక పరుగు మాత్రమే చేసి మాలిక్ బౌలింగ్‌లో సామ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. సతీశ్ ధావన్ కొద్ది సేపు నిలకడగా ఆడి 39 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో త్రివేదికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తివారి కూడా వెంటనే వికెట్ చేజార్చుకున్నాడు. 8 బంతులు ఆడి ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. క్లార్క్ వైట్ 28 బంతుల్లో ఆడి 31, సామీ 21 బంతుల్లో 29 పరుగులు చేయగా చేసి ఔటయ్యారు. పెరారే 11, సామంత్రే 14, శర్మ 2 (నాటౌట్), స్టెయిన్ 4 పరుగులు (నాటౌట్) చేశారు. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి వెంట వెంటే వికెట్లు కోల్పోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ 10 బంతుల్లో 12 (3 ఫోర్లు) పరుగులు చేసి ఔటయ్యాడు. రహానే 20 బంతుల్లో 18 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వాట్సన్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. యాగ్నిక్ 4 బంతులు ఆడి ఒక్క పరుగైనా చేయకుండా సమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బిన్నీ 2 పరుగులు, సామ్‌సన్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హాడ్జ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 29 బంతుల్లో 54 (2 ఫోర్లు, 5 సిక్స్‌లు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫాల్క్‌నర్ 11 పరుగులు చేసి చక్కని భాగస్వామ్యం అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో సామి 2, స్టెయిన్, ఇషాంత్, కరన్ శర్మ, మిశ్రా ఒక్కో వికెట్ తీశారు. రాజస్థాన్ బౌలర్లలో మాలిక్ 2, ఫాల్క్‌నర్, వాట్సన్, త్రివేది ఒక్కో వికెట్ తీశారు.