రెండేళ్ల కాలంలో ఆర్థిక’వృద్ది’

1
సిల్క్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాకు బడ్జెట్‌ ఊతం

లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన జైట్లీ

ఆశల పల్లకిలో మధ్యతరగతి

నేడు బడ్జెట్‌ సమర్పించనున్న ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జనంసాక్షి): కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2014-15 సంవత్సరానికి ఆర్థిక సర్వేను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సర్వే ప్రకారం బడ్జెట్‌లో పలు కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలను ఇచ్చారు. ప్రధాని మోదీ చేపట్టిన సంస్కరణలకు, స్కిల్‌ ఇండియా, మేక్‌ఇన్‌ ఇండియాకు బడ్జెట్‌లో ఊతమిచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్ల కాలంలో రెండంకెలకు ఆర్థిక వృద్ధిరేటు చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది. 2014-15 సంవత్సరానికి ఆర్థిక వృద్ధి 7.4 శాతంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2015-16లో 8 నుంచి 8.5 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. ద్రవ్యలోటును, ద్రవ్యోల్బణాన్ని కూడా గణనీయంగా నియంత్రించడం సాధ్యమే అని సర్వే ధీమా వ్యక్తం చేసింది. వ్యయాల నియంత్రణ ద్వారా ద్వవ్యలోటును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్నట్లు సర్వే పరిశీలించింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టడం ఆనవాయితీ. ఇదే బడ్జెట్‌ స్వరూప స్వభావాలను తెలియచేస్తుంది. శనివారం జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యోల్బణంగా గరిష్టంగా ఒక శాతం తగ్గి 5 నుంచి 5.5 శాతం దగ్గర నిలుస్తుందని అంచనా వేసింది. ఇక ద్రవ్యలోటును 4.1 శాతానికి నియంత్రించడం సాధ్యమే అని సర్వే భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం సబ్సీడీలను తగ్గించవలసి రావొచ్చని ఆర్ధిక సర్వే అంచనా. అయితే దానికి రాజాకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సర్వే గుర్తించింది. ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్వే పేర్కొంది. చమురు ధర తగ్గుదల, స్పెక్టమ్ర్‌ వేలం ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతుందని సర్వే అంచనా వేసింది. 2014-15లో ఆహారధాన్యాల ఉత్పత్తి 257 మిలియన్‌ టన్నులుగా అంచనా వేసింది. గత ఐదేళ్ల కంటే ఇది 8.5 మిలియన్‌ టన్నులు అధికామని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇక అరుణ్‌ జైట్లీ శనివారం 2015-16 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌పై అన్నివర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక వర్గాలు బడ్జెట్‌ ప్రతిపాదనల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న అరుణ్‌ జైట్లీ ఈసారి కూడా తమను కరుణిస్తారని, ఆదాయం పన్ను మినహాయింపులను పెంచుతారని, శ్లాబుల్లో కూడా సవరణలు తీసుకొచ్చి రాయితీలను పెంచుతారని ఉద్యోగస్థులు ఆశిస్తున్నారు. అలాగే పన్ను మినహాయింపుల ద్వారా  పొదుపు చర్యలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు.  ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారం లేకుండా గృహరుణాలకు మరింత రాయితీలు కల్పించాలని, 80 సీ కింద పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని మధ్యతరగతి వారు ఆశిస్తున్నారు. ఆర్థిక శాఖతోపాటు కార్పొరేట్‌ వ్యవహారాలు, సమాచార, ప్రసారాల శాఖలను కూడా జైట్లీ నిర్వహిస్తున్నందున బడ్జెట్‌లో తమకూ న్యాయం జరుగుతుందని ఆయా వర్గాలు విశ్వసిస్తున్నాయి. 2014లో తొలిసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు అరుణ్‌ జైట్లీ రూ. 2 లక్షలుగా ఉన్న ఆదాయం పన్ను రాయితీని రూ. 2.5 లక్షలకు పెంచడంతోపాటు పన్ను శ్లాబుల్లో రాయితీలను పెంచారు. పలు సందర్భాల్లో ఆదాయం పన్ను రాయితీలను పెంచుతామని అరుణ్‌ జైట్లీయే స్వయంగా ప్రకటించినందున ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల ఆదాయం పన్ను కనీస పరిమితిని కనీసం రూ. 3 లక్షలకు పెంచడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే శ్లాబుల్లోనూ మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న ఆదాయ వనరులను పెంచుకోవడానికి పరోక్ష పన్నులను పెంచవచ్చని, క్రూడాయిల్‌ (ముడి చమురు) దిగుమతులపై ఎత్తేసిన కస్టమ్స్‌ సుంకాన్ని తిరిగి విధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తవుతున్న క్రూడాయిల్‌పై రెండు శాతం పన్ను ఇప్పటికీ అమల్లో ఉంది. క్రూడాయిల్‌ వినియోగంలో మనం 80 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. సుంకం విధింపు వల్ల అనివార్యంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతాయి.అధిక ఆదాయం పన్ను శ్లాబుల్లో ఉన్నవారికి వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దిశగా గత ఆరునెలలుగా సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. సరుకులు, సేవా పన్నులను పెంచడం ద్వారా ప్రత్యక్ష పన్నులను స్థిరీకరించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సేవా పన్నును 12 నుంచి 14 శాతానికి పెంచవచ్చని వారి అంచనా. అదే జరిగితే ఫోన్‌ కాల్స్‌ చార్జీలు, ¬టళ్లలో ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. జిమ్‌లు ప్రియమవుతాయి. క్లబ్‌ మెంబర్‌షిప్పులు భారమవుతాయి. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఇప్పటికే తగ్గినందున పది శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించే సూచనలు కనిపించడం లేదు. ఆటోమొబైల్‌ రంగం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును కోరుకుంటున్నా.. ఆ దిశగా చర్యలు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.