రైతుబంధు పేదరైతులకు వరం: ఎమ్మెల్యే

కొత్తగూడెం,మే3(జ‌నం సాక్షి): అన్నదాతను ఆదుకునేందుకే సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుబందు పథకాన్ని ప్రవేశ పెట్టారని టైకార్‌ చైర్మన్‌, అశ్వారావుపేట ఎమెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం ఎకరానికి రూ.4వేలు, రెండు పంటలకు రూ.8వేలు ఇస్తున్న ప్రభుత్వం మనదేనన్నారు. పేద రైతుల సౌకర్యార్థం రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి రూ.4 వేలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీవరకు రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా గ్రామపంచాయతీలో రైతులకు అవగాహన కల్పించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం మన పథకాల గురించి తెలుసుకోవటానికి ఆసక్తిని కనబర్చుతున్నాయని అన్నారు.  ఇప్పటికే మిషన్‌ కాకతీయ ద్వారా చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందుతుందని అన్నారు. త్వరలో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పారు విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని అన్నారు.
రైతుబంధు పేదరైతులకు ఒక వరం అని అన్నారు.