రైతులను వెన్నాడుతున్న అకాల వర్షం భయం

మక్కల రక్షణకు కాపలాగా రైతు కుటుంబాలు
ఖమ్మం,మే8(జ‌నం సాక్షి): మొన్నటి గాలిదుమారంతో కూడిన వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ ధాన్యం కొట్టుకుపోతుందో అని దిగులు చెందుతున్నారు. రవాణా సక్రమంగా లేకపోవటంతో 15 రోజులుగా కాంటాలు సక్రమంగా జరగడం లేదని మక్క రైతులు వాపోతున్నారు. ఇప్పటి వరకూ కాంటాలు వేసిన మొక్కజొన్నను గోదాములకు తరలించి వెంటనే మిగిలిన మొక్కజొన్న రాశులను కాంటాలు వేయటం ప్రారంభించాలని రైతులు పేర్కొన్నారు. వర్షం పడితే మొక్కజొన్న తడవకుండా ఉండేందుకు కప్పే పట్టాలు కూడా అందుబాటులో లేవని రైతులు వాపోతున్నారు. కనీసం రైతుల అవస్థలను కొనుగోలు కేంద్రం వద్ద పట్టించుకొనే వారు లేరని రైతులు వాపోతున్నారు. పశువులు తినకుండా, దొంగల భారీనుంచి పంటను కాపాడుకొనేందుకు రాత్రింబవళ్లూ కాపలా ఉండాల్సి వస్తోందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్క్‌ఫెడ్‌ అధికారుల పర్యవేక్షణ లేమి.. రైతులే కదా అన్న చిన్న చూపు.. ప్రధాన శాఖల మధ్య లోపించిన సమన్వయ లోపం.. వెరసి వందలాది మంది రైతులు 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటాలు వేసిన మొక్కజొన్నను సైతం గోదాములకు తరలించకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రంలోనే
కుటుంబ సభ్యులంతా కాపలా కాయాల్సిన దుస్థితి దాపురించింది. కాంటాలు వేసి రోజులు గడుస్తుండంతో బస్తాలకు చెదలు పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. సాయంత్రం సమయంలో గాలిదుమారంతో పాటు వర్షం పడుతుండటంతో రైతులు కంటివిూద కునుకు లేకుండా గడపాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కాంటాలు వేసిన 20 వేల మొక్కజొన్న బస్తాలను గోదాములకు తరలించేందుకు లారీలు రాకపోవటంతో గత్యంతరం లేక నాలుగు రోజులుగా చింతకానిలో కాటాలు వేయడం నిలిపివేశారు. ఈ నేపథ్యంలో చింతకాని కొనుగోలు కేంద్రం సవిూపంలోని 30 ఎకరాల స్థలంలో వందలాది మొక్కజొన్న రాశులు పోసి కాంటాల కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తోంది.  చింతకాని కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకూ 35,240 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. వాటిలో కేవలం 15 వేల క్వింటాళ్ల మొక్కజొన్నను మాత్రమే రవాణా చేశారు. మిగిలిన 20 వేల మొక్కజొన్న బస్తాలు కాంటాలు వేసి లాట్లు కట్టి రవాణాకు సిద్ధంగా ఉన్నాయి.