రైతు సంక్షేమ ప్రభుత్వం మనది

కెసిఆర్‌ పథకానికి ప్రాచుర్యం తేవాలి: ఎమ్మెల్యే
కొత్తగూడెం,మే7(జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్‌ర్లు అన్నారు. రైతుబంధు దేశానికి ఆదర్శం కాబోతున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్మాణాత్మకంగా పనిచేసి ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలని అన్నారు.దేశంలో సీఎం కేసీఆర్‌ పరిపాలనపై ప్రశంసలు జల్లు కురుస్తుందని, నాడు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హావిూలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని పథకాలను  అమలుపరిచేందుకు ముందుకు సాగుతున్నారన్నారు. వ్యవసాయరంగాన్ని నాటి పాలకులు దుర్భరం చేశారని, రైతాంగ అభివృద్ధి కోసం సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో ఈ రాష్ట్రాన్ని రైతురాజ్యంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం పరుగులు పెడుతుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేస్తున్న అబద్ధ ప్రచారాలు మానుకోవాలన్నారు. రాష్ట్రంలో రైతులు తలఎత్తుకొని బతికేలా సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ప్రతిఎకరాకు మొదటిపంటకు పెట్టుబడి కోసం రూ.4 వేలు అందజేస్తుందని తెలిపారు. జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా రూ.256 కోట్లను ఈనెల 10వ తేదీ నుంచి 17వరకు చెక్కులతో పాటు, పట్టాదారు పాస్‌పుస్తకాలను కూడా అందించబోతుందన్నారు. ప్రతి గ్రామంలో రెండురోజుల ముందే కార్యకర్తలు, నాయకులు, రైతుసమన్వయ సమితి సభ్యులు దీనిపై వివరించాలన్నారు. పెట్టుబడి పధకంతో రైతులకు ప్రభుత్వం ఆసరాగా ఉండబోతుందని వివరించారు. 24 గంటలు విద్యుత్‌ సరఫరా, సాగునీటిని అందించడం
వల్లనే రైతులకు ప్రయోజనకరంగా మారిందన్నారు.  రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలన్నారు.  కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి నియోజకవర్గంలో గులాబీజెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో 760 గురుకుల పాఠశాలలను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి విద్యావిధానంలో పలుమార్పులు తీసుకొచ్చి బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీల పిల్లల కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.