విద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండాలి
కొత్తగూడెం,మే7(జనం సాక్షి): రైతులు తమకు తెలియన విద్యుత్ సమస్యల జోలికి వెళ్లి ప్రాణాల విూదకు తెచ్చుకోవద్దని విద్యుత్ అధికారులు సూచించారు. ట్రాన్స్‌ఫారంల వద్దకు వెళ్లడం, ఫజీఉలను ఇష్టం వచ్చినట్లుగా వినియోగించడం వల్ల తరచూప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి కొన్ని భద్రత సూత్రాలు పాటించాలని తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ స్తంభాలు, తెగి పడిన తీగెలు, మోటార్లను తాకకూడదని, వేలాడుతున్న కరెంటు తీగలు లైన్లు, చెట్ల కొమ్మలకు తాకి మంటలు వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా సంబంధిత కరెంటు ఆఫీసులకు తెలియజేయాలని, సబ్‌స్టేషన్ల అనుమతి ఎల్‌సీ (లైన్ క్లియరెన్స్)లు తీసుకోకుండా ఎవరైనా ఫీజులు మార్చడం, తీగలు సరిచేయడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. సర్వీస్ వైర్లను, వీధి దీపాలను సరి చేసేందుకు అనుమతి లేకుండా స్తంభాలు ఎక్కవద్దని సూచించారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం పంపుసెట్లను వినియోగించేటప్పుడు కరెంటు మోటార్లు, పైపులను ఏమరపాటుతో తాకకూడదని మోటార్లు దగ్గర్లకు వెళ్లినపుపడు జాగ్రత్తగా ఉండాలన్నారు. అదేవిధంగా ఇంట్లో ఎలక్టిక్రల్ హౌజ్‌వైరింగ్ దగ్గరలో ఇనుమ తీగను దండెంగా కట్టి తడి బట్టలు వేయవద్దని పేర్కొన్నారు. ఈనెల 1 నుంచి అన్ని మండలాల్లో వారోత్సవాలు నిర్వహించి రైతులు, వినియోగదారులకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులను సంప్రదించాలని అన్నారు.