సంఖ్యాబలంలేదు… రాజ్యసభకు దూరం

4

– కాంగ్రెస్‌ నిర్ణయం

హైదరాబాద్‌,మే28(జనంసాక్షి):  రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సరైన సంఖ్యా బలం లేనందున పోటీ నుంచి తప్పుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జూన్‌ 21తో గుండు సుధారాణి, వి.హనుమంతరావుల రాజ్యసభ పదవీకాలం పూర్తవుతుంది. దీనికోసం ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసింది. రాజ్యసభకు తిరిగి పోటీ చేసేందుకు వీహెచ్‌ ఆసక్తి చూపినప్పటికీ… తగిన సంఖ్యాబలం లేకుండా పోటీ చేస్తే భవిష్యత్తులో పార్టీకి నష్టం కలగొచ్చని నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్‌ఇన సిఎల్పీ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. బలం లేకున్నా ఏదోచేయబోతున్నారన్న అనైతిక వాతావరణం సృష్టించడం సరికాదని అన్నారు. నిజాయితీ రాజకీయాలు కొనసాగాలని తాముకోరుకుంటున్నామని జానారెడ్డి అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేదని గుర్తించి పోటీ చేయరాదని నిర్ణయించా మన్నారు. విహెచ్‌ పోటీకి సిద్దపడినా అందుకు కాంగ్రెస్‌ ముందుకురాలేదు. రాజ్యసభ ఎన్నికలలో గెలిచినా,గెలవకపోయినా,పోటీచేయాలన్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు కోరిక తీరడం లేదు. కాంగ్రెస్‌ శాసనసభ పక్షం సమావేశం అయి దీనిపై చర్చించింది. రాజ్యసభ ఎన్నికలలో పోటీచేయడం వల్ల లాభమా?నష్టమా అన్నదానిపై చర్చించింది. తగు బలం లేకుండా పోటీచేయడం వల్ల తప్పుడు సంకేతం పంపినట్లు అవుతుందని, భవిష్యత్తులో నష్టం జరుగుతుందని నేతలు భావించారు.  అందువల్ల రాజ్యసభ పోటీ లో ఉండరాదని నిర్ణయించారు. కాగా వి.హనుమంతరావు తాను పోటీచేస్తానని అదిష్టానాన్ని కూడా కోరివచ్చారు. తాను రాజ్యసభ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాని కాంగ్రెస్‌ నేత వీ. హనుమంతరావు స్ఫష్టంచేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ రెండు సంవత్సరాల్లో ఎన్డీయే ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగట్టారు. రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు కోరదామనుకున్నామని, సీఎం కేసీఆర్‌ ఆనవాయితీ కొనసాగిస్తారని అనుకున్నామని, అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో విరమించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ఊరూరా తిరిగి చెబుతానని ఆయన అన్నారు. ఏపీతో సమానంగా తెలంగాణకు కేంద్రం సాయం చేయాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పోటీచేయకపోతే టిఆర్‌ఎస్‌ అభ్యర్దులు డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావులు ఏకగ్రీవంగా తెలంగాణ శాసననసభ నుంచి రాజ్యసభకు

ఎన్నికవుతారు.నామినేషన్‌ వేయడం కోసం డి.శ్రీనివాస్‌ తన సలహాదారు పదవికి రాజీనామా కూడా చేశారు.