సంప్రదింపులే మంచిది
ఎగువున ఉన్న కర్నాటక,మహారాష్ట్ర ప్రభుత్వాలు లెక్కకు మిక్కిలి ప్రాజెక్టులు కట్టడంతో ఇప్పటికే కృష్ణాగోదావరిలో ఉమ్మడి రాష్ట్రంలోనే నీటికటకటలు తప్పలేదు. ఇవాళ ఉభయనదుల్లో నీరు లేకపోవడానికి ఈ రెండు రాష్టాల్రే కారణంగా చెప్పుకోవాలి. నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల నిర్మాణంతో కృష్ణా వట్టిపోయింది. వరదలు వస్తే తప్ప నీరు రాని పరిస్థితి కృష్ణాలో చూస్తున్నాం. ఇంతకన్నా దారుణం మరోటి ఉండబోదు. ఆనాడే ఈ రెండు ప్రాజెక్టులను అడ్డుకోవడంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇకపోతే బాబ్లీ సహా అనేక ప్రాజెక్టులను కట్టడంతో గోదావరిని వట్టిపోయేలా మహారాష్ట్ర చేసింది. దీంతో పుష్కరాల్లో కూడానీరు లేక జల్లు స్నానాలు చేయాల్సి వచ్చింది. ఆనాడు కేంద్రం చూస్తూ ఊరుకుంది. సుప్రీం కోర్టు కూడా ఏవిూచేయలేకపోయింది. సమగ్ర జలవిధానం లేకపోవడం కారణంగానే ఇది జరిగింది. ఇప్పుడు తెలంగా ప్రభుత్వం నీటి కేటాయింపులకు అనుగుణంగా, గతంలోఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అనుమతుల మేరకు ప్రాజెక్టులను నిర్మించాలని సంకల్పించగానే కాంగ్రెస్ తదితర పార్టీలు గగ్గోగు పెట్టడం కేవలం ఉనికి కోసం తప్ప మరోటి కాదు. రాజకీయ ఉనికిక కోసం కాంగ్రెస్,వైకాపాలు దీనిని సాకుగా చూపుతూ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఆనాడు కాంగ్రెస్ చేసిన నిర్వాకం వల్లనే తెలంగాణ వట్టిపోయింది. పాలమూరు, కాళేశ్వరం తెరపైకి వచ్చి ముందుకు సాగే క్రమంలో రాజకయీ పార్టీలు తమ అస్తిత్వం కోసం పాకులాడడం మొదలు పెట్టాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతల్లో ఈ ప్రాజెక్టుల అంశమే చర్చనీయాంశమైంది. మాచర్లలో జరిగిన ధర్నాలో విపక్ష నేత జగన్‌మోహర్‌డ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సైతం నీటి కేటాయింపుకలు అనుగుణంగా వీటిని చేపడుతున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు ఆపాలని, పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులకు ఎ విధమైన అనుమతులు లేవవి, అవి రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకం అంటూ చంద్రబాబు ప్రభుత్వం విమర్శించింది. ఈ విషయాలన్నీ వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. నిజానికి ఆనాడు మరి ప్రాణహిత చేవెళ్లకు, పాలమూరు ప్రాజెక్టులకు లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయన్నది ఇక్కడ గమనించాలి. అందుకే ఆంధప్రదేశ్‌లో కొన్ని పక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో పాలకులు ఇచ్చిన జిఓల ఆధారంగానే కృష్ణా గోదావరుల్లో 1300 టింఎసిల నీటిపై మనకు హక్కు ఉంది. ఆరునూరైనా సరే .. ఏది ఏమైనాసరే … పిడుగులు పడినా, భూ కంపాలు వచ్చినా ఆ నీటిని వాడుకుంటాం. ఆ మేరకు ప్రాజెక్టుల కట్టితీరుతాం అని సిఎం కెసిఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంపువల్ల నవ్యాంధ్రకు నష్టం జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులద్వారా తెలంగాణ 135 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశముందన్నారు. దీనివల్ల ఏపీకి జరిగే నష్టాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తెచ్చామన్నారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రికీ లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు చెప్పారు. నిజానికి సముద్రంలో వృధాగా పోయే జలాలలను వాడుకుందామని తెలంగాణ సిఎం కెసిఆర్ కూడా ప్రతిపాదించారు. ఈ సమస్యను జటిలం చేయడం వల్ల మళ్లీ ఇరు రాష్టాల్ర ప్రజల మధ్య లేనిపోని అపోహలు రాగలవని గుర్తించాలి. రాజకయీ పార్టీలు ఆజ్యం పోయడం మానుకుని వ్యాజ్యాలు లేకుండా చూసుకోవాలి. కొత్తగా ఏర్పాటైన రెండు రాష్టాల్ర మధ్య కొత్త సమస్యలు రాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. సమైక్య పాలకులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కృష్ణా, గోదావరుల్లో కలిపి తెలంగాణకు 1300 టీఎంసీలకు పైగా నీటి కేటాయింపులున్నాయి. దానికి లోబడే ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ వివాదాలకు తావు లేకుండా ఇరు రాష్టాల్రు సమస్యలపై చర్చించుకోవచ్చు. రాజకీయ పార్టీలు అదే పనిగా రెచ్చగొట్టే వ్యవహరాలకు దూరంగా ఉండాలి. వీరి కారణంగానే ఇంతకాలం తెలంగాణ దగాపడడమే గాకుండా ప్రత్యేక ఉద్యమానికి హేతువుగా మారింది. ఉభయ రాష్టాల్రకు ఆమోద యోగ్యంగానే ప్రాజెక్టులను నిర్మించాల్సి ఉంటుందని చంద్రబాబు అంటున్నారు. అప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులపై ముందుకు సాగకుండా చూడాలని కేంద్రానికి విన్నవిస్తామని చంద్రబాబు తెలిపారు. కృష్ణా జలాలపై ఏర్పాటైన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ఈ దశలో చర్చించడానికి సిఎం కెసిఆర్ సిద్దంగా ఉన్నాని ప్రకటించినందున ఈ వివాదాన్ని పెద్దదిగా చేసుకోవడం సరికాదు. ఇరురాష్టాల్ర ప్రభుత్వాలు కూర్చుని చర్చించుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దక్కగలదు. లేని పక్షంలో పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుఉల కూడా మరింత వివాదానికి దారి తీస్తాయని గుర్తుంచుకోవాలి. ఇలా రెండు రాష్టాల్రు కలహించుకోవడం సరికాదన్నది కూడా గుర్తుచేసుకోవాలి.