సకల జనుల సమ్మెలో ఎన్‌ఎంయూ సైంధవపాత్ర


శ్రీ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

శ్రీటీఎంయూను భారీ మెజార్టీ గెలిపించాలని పిలుపు

వరంగల్‌, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) :

తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు ఐక్యంగా నిర్వహించిన సకల జనుల సమ్మెకు ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు మహమూద్‌ తూట్లు పొడిచారని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. మంగళవారం నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన టీఎంయూ ఎన్నికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీమాంధ్ర పాలకులకు తొత్తుగా మారిన ఎన్‌ఎంయూ కార్మికుల హక్కులను పణంగా పెట్టిందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో పాత బస్సులకు కలర్‌ వేసి పల్లెవెలుగు అని పేరు పెట్టి తిప్పుతున్నారని, అదే ఆంధ్ర ప్రాంతానికి కొత్త బస్సులు

పంపుతూ సంస్థను నష్టాల్లోకి నెటుడుతున్నారని తెలిపారు. ఎన్‌ఎంయూ నాయకులు తెలంగాణ ప్రాంతంలో జై తెలంగాణలో, సీమాంధ్ర ప్రాంతంలో జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేస్తూ పబ్బం గడపాలని చూస్తున్నారని తెలిపారు. సంఘం అన్నాక ఒక విధానం అంటూ ఉండదా అని ప్రశ్నించారు. మళ్లీ ఎన్‌ఎంయూ ఓటు వేస్తే ఆర్టీసీ కార్మికుల హక్కులు కాలరాయడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి అద్దం పడుతూ టీఎంయూను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ, టీఎంయూ నాయకులు పాపిరెడ్డి, అంబటి శ్రీనివాస్‌, జగదీశ్వర్‌, జహీద్‌, చంద్రమౌళి, తాళ్ల సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వరంగల్‌ డాక్టర్‌ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాధన ర్యాలీని కోదండరామ్‌ ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు తెలంగాణ సాధన కోసం ఉద్యమించడం శుభపరిణామమన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని సీమాంధ్ర పాలకులు, ఢిల్లీ పెద్దలు గుర్తించాలని సూచించారు.