సమస్యలకు సత్వర పరిష్కారం
ఖమ్మం,నవంబర్8(జనంసాక్షి): పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ లోకేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోడివిజన్, మండలస్థాయిలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సంబంధించిన నివేదికలు అందజేయాలని చెప్పారు. ప్రజలు సమర్పించిన పిటిషన్ పరిష్కార స్వభావాన్ని వారికి తెలియజేయాలని అధికారులకు తెలియజేశారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం ద్వారా మంజూరు చేసిన నిధులకు సంబంధించిన ఖర్చులు, మిగిలిన నిధులకు సంబంధించిన సమగ్ర నివేదికలను తయారు చేయాలని చెప్పారు. సంక్షేమ వసతిగృహాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున మరమ్మతులు చేపట్టని భవనాలను పరిశీలించి వాటి స్థితిగతులు, నిధుల వినియోగం, మిగులు నిధులకు సంబంధించిన సమగ్ర నివేదికలను అందజేయాలని సూచించారు.