సమస్యల పరిష్కారం అభివృద్దిలో భాగమే
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ,ఎపిలుగా ఏర్పడ్డా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి విభజన హావిూలను అమలు చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమయ్యింది. బిజెపి అధికారంలోకి వచ్చాక వినూత్నంగా సాగుతుందని భావించిన ఇరు రాష్ట్రాల పాలకులకు మోడీ చేదు గుళికలే తినిపించారు. నిజానికి ఎంతో పురోగమించేలా చేయూతను అందించాల్సిన బిజెపి పాలకులు ఎందుకనో చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టారు. నాలుగేళ్లుగా సమస్యలను నాన్చడంతో తెలంగాణలో సిఎం కెసిఆర్ ఒంటరిగానే అభివృద్దిలో దూసుకుని పోతున్నారు. అనేక పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. ఇకపోతే ఎపిలో బిజెపితో జతకట్టినా లాభం లేకపోవడంతో చంద్రాబాబు ఎన్‌డిఎ నుంచి బయటపడ్డారు. నవనిర్మాణ దీక్షతో జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. మొత్తంగా విభజన తరవాత రెండు రాష్ట్రాల్లో సమస్యలు అలాగే ఉన్నాయి. నాలుగేళ్ల సమయం తక్కువేం కాదు. సమస్యలు పరిష్కరించడమంటే అభివృద్దిని చేయడమన్న భావన రావాలి. అనేక పర్యాయాలు కేంద్రం దృష్టికి తీసుకుని వస్తున్నా కేంద్రంలోని బిజెపి రాజీకయ కోణంలోనే చూస్తోంది తప్ప ప్రజల హితంలో చూడడం లేదు. హైకోర్టు విభజన కావచ్చు..పోలవరం నిర్మాణం కావచ్చు..విలీన మండలాల సమస్యలే కావచ్చు…. అమరావతి నిర్మాణమే కావచ్చ… ఉద్యోగుల కేటాయింపులే కావచ్చు.. అనేక సమస్యలు నాలుగేళ్లుగా నానుతున్నాయి. ఇవన్నీ కేంద్రం త్వరగా పరిష్కరించి ఉంటే అభివృద్ది వేగంగా జరిగేది. కానీ ప్రధాని మోడీ తొలినాళ్లలో ప్రకటించిన ఆదర్శాలు గంగలో కలిశాయి. ఆయన నేతృత్వంలో సమస్యలు పరిష్కారం అవుతాయా అన్న ఆందోళన కలుగుతోంది. నాలుగేళ్ల పూర్తతున్నా, కాలం గిర్రున తిరిగిందే తప్ప ..కాలయాపన జరిగిందే తప్ప సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు ఏర్పడటం, కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, ఆర్భాటాలు చేయడం, పథకాలను చివరికి పేపర్లకు అంకితం చేయడం మనం దశాబ్దాలుగా చూస్తున్నదే. జన సంక్షేమమే అంతిమ ఎజెండాగా పనిచేసే వారే నిజమైన పాలకులు అని మహాత్మాగాంధీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు సర్వసాధారణం అయినా ప్రజలంతా తమకు ఏదొ బాగు జరగాలన్న లక్ష్యంతో ఓటేస్తారు. ఎవరో ఒకరిని గద్దెనెక్కించేందుకు కాదని గుర్తు చేసుకోవాలి. గెలుపు, మరోవైపు ఓటములను విశ్లేషించుకుని బిజెపి పనిచేయాల్సి ఉంటుంది. ప్రధాని మోడీ ప్రజల సమస్యలను తెలుసు కుని ముందుకు సాగాల్సి ఉంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్దేశించి ముందుకు నడిస్తేనే చెప్పిన మాటలకు, ఇచ్చిన హావిూలకు విలువ ఉంటుంది. ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపికి అందలం ఎక్కిస్తే అందుకు అనుగుణంగా కిందిస్థాయిలో హావిూలు నెరవేరి ప్రజలు బాగుపడుతున్నారా లేదా అన్నది చూడాలి. ప్రధాని నరేంద్రమోదీ నవభారతాన్ని ఆవిష్కరిస్తామని, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తామని అంటున్న మాటలు నిజం కావాలి. అంటే అవి మంత్రాక్షరాలుగా పనిచేయాలి. పాలకులు అందుకు తగ్గట్లుగా ప్రజలకు సేవ చేయగలగాలి. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి సరికొత్తగా వెలుగు లీనుతూ ఉన్నత శిఖరాలను అందుకునే దేశంగా అవతరించాలన్న ప్రధాని సంకల్పాన్ని నిజం చేసేలా కార్యాచరణ కూడా చేసుకోవాలి. ఈ దేశంలో పేదలు తమకోసం ఏదో ఒకటి జరగాలని కోరుకుంటున్నారు. తమకు కొత్త అవకాశాలు రావాలని, తమ బతుకులు బాగు పడాలని చూస్తున్నారు. దీనిని ప్రతిసారీ ఎన్నికల ఫలితాల రూపంలో తెలియచేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. వాగ్దానాలు చేయడం వాటిని మరవడం సరికాదు. అందువల్ల ప్రజల ఆకాంక్షలను నిరంతరం నెమరువేసుకునేలా నాయకులు ఉండాలి. ఎన్నికల్లో ప్రజాతీర్పునకు అనుగుణంగా పాలకులు నడుచుకుని ఉంటే పేదలఆకాంక్షలు నెరవేరడానికి ఇంతకాలం పట్టేది కాదు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడం అన్నది కష్టతరమే కాకుండా క్లిష్టం కూడా. దేశ భవిష్యత్తు నిర్మాణంలో పేదలకు ఎంత అధికంగా అవకాశం లభిస్తే దేశం అంత వేగంగా ముందుకెళ్తుంది. ఇలా తెలుగు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడం అన్నది అభవృద్దిలో భాగంగా చూడాలి. నిజానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రలలను కూర్చోబెట్టి అభివృద్దికి ప్రణాళిక చేసివుంటే మోడీకి మరింత ఆదరణ పెరిగేదు. కేవలం సమస్యలను రాజకీయ కోణంలో చూడడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్లమెంటులో ఇరు రాష్ట్రాల ఎంపిలు ఇంకా విభజన సమస్యలపై మాట్లాడాల్సి రావడం సిగ్గుచేటుగా భావించాలి. గతంలో కాంగ్రెస్‌ను విమర్శించి ఇప్పుడు అదే బాటలో నడుస్తామంటే ఎలా అన్నది మోడీ ఆలోచన చేయాలి. భారతదేశంలో గ్రామస్వరాజ్యం రావాలని గాంధీజీ కలలు కన్నప్పటికి ఆయన సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అర్ధ దశాబ్దం పాలించినా అది సాకారం కాలేదు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం సిద్దించగలదు. గ్రామాలు బాగుపడితేనే దేశం ఆర్థికంగా పటిష్టం అవుతుంది. అందుకు పాలకులు నడుం బిగించాలి. ఆ దిశగా కార్యక్రమాలు చేయాలి. అయితే గ్రామాల్లో అలాంటి కార్యక్రమాలు జరిగిన దాఖలాలు కనబడడం లేదు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణులను పెంచి పోషించిన రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. ఇలాంటి రాజకీయాలకు చరమగీతం పాడాలి. స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు నిధులు అందించి, అంతటా అభివృద్ది అన్న నినాదమే అసలైన పాలన కావాలి. వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు మరింత తక్కువ వడ్డీపై పంట రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టాలి. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తేనే పథకాలు సాకారం అవుతాయి. వ్యవస్థ బాగుపడాలన్న సంకల్పంతో ఉపయోగపడే పనులకు తొలి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం సాగాలి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు గమనించాలి.