ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కదిలిన ఊరూవాడా
నిర్మల్ (జనంసాక్షి) : ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ దద్దరిల్లింది. చిన్నారులు, మహిళలు సహా వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున రోడ్డెక్కారు. ప్రజాప్రతినిధులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు కనబడటం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూనే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం నిరంతరం పోరు చేస్తామని భీష్మించారు. దిలావర్‌పూర్ మండలాన్ని కాపాడుకుందామని చిన్నారులు సైతం గొంతు కలిపారు. మహిళలు, చిన్నపిల్లలు ధర్నాలో ముందుండి నినాదాలు చేయడం విశేషం. వందలాది మంది రోడ్డుపైకి తరలిరావడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. గత మూడు నెలలకుపైగా ప్రతిరోజూ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్న ప్రజలు.. ఈరోజు చేపట్టిన ఆందోళన ఇథనాల్ కంపెనీపై పోరును ఉధృతం చేసింది. భైంసా నిర్మల్ జాతీయ రహదారి మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అంతకుముందు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.