భోపాల్‌ కార్బైడ్‌ విషాదం అంతా ఇంతా కాదు

` గ్యాస్‌ లీకేజీ వల్ల మరణించింది 3780
` 5 లక్షల మంది విషవాయువు బాధితులుగా మిగిలారు
` ఆ కాలుష్యం పీల్చినవారికి 50శాతం కడుపులోనే విషపదార్థాలు
` పుట్టబోయే శిశువులపైనా ప్రభావం..
` ఇప్పటికీ క్యాన్సర్‌, కాలేయ సంబంధిత వ్యాధులు
` ఒకేరోజు 875 శవాలకు పోస్టుమార్టం చేసిన డాక్టర్‌
` 40 ఏండ్లుగా న్యాయం కోసం కొట్లాడుతున్న బాధితులు
ఓ రాత్రి వెలువడిన రసాయనాలు లక్షలాది మంది ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రాణాలు పోయేలా తనువెల్లా విషవాయువులు వ్యాపించాయి. వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఐదు లక్షల మందిపైగా చుట్టుపక్కల స్థానికులందరినీ చుట్టిముట్టి ఇప్పటికీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఓ పరిశ్రమ కారణంగా ప్రపంచంలోనే అత్యంత విషాదకర దుర్ఘటన చోటుచేసుకున్న ఈ ఉదంతం నలభై ఏండ్లు కావొస్తున్నప్పటికీ బాధితులు మాత్రం న్యాయం కోసం ఇంకా కొట్లాడుతూనే ఉండటం గమనార్హం..!!
భోపాల్‌, నవంబర్‌ 24 (జనంసాక్షి) :
మధ్యప్రదేశ్‌లోని యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన విషవాయువులు కనీవినీ ఎరుగని విషాదాన్ని మిగిల్చిన విషయం విదితమే. భోపాల్‌ యూనియన్‌ కార్బైడ్‌ కర్మాగారం నుంచి 1984 డిసెంబర్‌ 2న అర్ధరాత్రి విష వాయువులు లీకయ్యాయి. ఆ దుర్ఘటనలో 3787 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 5లక్షల మంది ప్రభావితమయ్యారు. దాని బాధితులు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రమాదం జరిగిన రోజు భోపాల్‌ మెడికల్‌ కాలేజీలో ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతిగా ఉన్న డాక్టర్‌ డీకే సత్పతి.. ఆ దుర్ఘటన జరిగిన రోజే 875 శవపరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా తదుపరి ఐదేళ్లలో దాదాపు 18వేల మంది బాధితుల శవ పరీక్షలకు సాక్షిగా మిగిలిన ఆయన ఇప్పటికీ పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఈ దుర్ఘటన నుంచి బయటపడిన వారి తర్వాతి తరాల్లోనూ ఆ విషవాయువుల ప్రభావం కనిపించిందని ఓ వైద్యుడు చెబుతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. వాటిపై నిర్వహించిన పరిశోధనలను ఎందుకు నిలిపివేశారో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
కడుపులో, పుట్టబోయే బిడ్డలో విషపదార్థాలు
భోపాల్‌ దుర్ఘటన బాధిత సంఘాలు ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో డాక్టర్‌ సత్పతి కొన్ని కీలక విషయాలు వెల్లడిరచారు. అప్పటి ప్రమాదం నుంచి బయటపడిన మహిళలకు పుట్టబోయే పిల్లలపై ప్రభావం గురించి లేవనెత్తిన ప్రశ్నలను యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ ఖండిరచిందన్నారు. దీని ప్రభావాలు గర్భంలోని బిడ్డపై చూపవని యూనియన్‌ చెప్పిందన్నారు. అయితే ప్రమాదంలో మరణించిన గర్భిణుల రక్త నమూనాలను పరీక్షించగా తల్లిలో కనిపించిన 50శాతం విషపదార్థాలు కడుపులో ఉన్న బిడ్డలోనూ ఉన్నట్లు తేలాయి. ప్రాణాలతో బయటపడిన మహిళలకు పుట్టిన చిన్నారుల్లోనూ విషపూరిత రసాయనాల ఆనవాళ్లు కనిపించాయి. తర్వాతి తరం ఆరోగ్యంపైనా అవి ప్రభావం చూపాయి. దీనిపై జరిపిన పరిశోధనను ఎందుకు నిలిపివేశారని ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రశ్నించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన మిథైల్‌ ఐసోసైనేట్‌ గ్యాస్‌ నీటిలో కలవడంతో అనేక విషవాయువులు ఏర్పడ్డాయని, అవి క్యాన్సర్‌, కాలేయ సంబంధిత వ్యాధులకు కారణమయ్యాయని వివరించారు.