కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం
` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత
` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు
` అది ఇండస్ట్రియల్ కారిడార్
` వామపక్ష నేతలతో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని.. ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను ప్రతిపాదించినట్టు సీఎం చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల ఘటనపై సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యు), ఆర్‌ఎస్పీ, సీపీఐ (ఎంఎల్ ? లిబరేషన్) తదితర పార్టీల నాయకుల ప్రతినిధుల బృందం సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో కలిసి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను వామపక్ష నేతలకు సీఎం సమగ్రంగా వివరించారు.కొడంగల్‌లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని నేతలకు చెప్పారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని.. సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం కల్పించాలన్న ఆలోచనే తప్ప.. ఎవరికీ నష్టం కలిగించే ఉద్దేశం తనకు లేదన్నారు. ఉపాధికి అవకాశాలు పెంచే దిశగా ఇండస్ట్రియల్ కారిడార్‌లో కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. భూసేకరణ విషయంలో పరిహారం పెంచాలన్న అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, ఇతర నాయకులు సీఎంని కలిసిన వారిలో ఉన్నారు.