సర్కారే శాంతి ప్రక్రియకు ప్రయత్నించాలి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని రావనకాష్టంలా మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరులో ఎలాంటి మార్పు రాలేదు. సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను మావోయిస్టులు మందుపాతర పేల్చి, కాల్చి చంపిన తర్వాత కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ప్రతిస్పందించిన తీరు చూస్తే ప్రశాంత ఛత్తీస్‌గఢ్‌ ఇప్పుడప్పుడే దర్శనమిచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. మావోయిస్టుల సమస్యను కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోంది. కానీ అందుకు దారి తీసిన పరిణామాలను బేరిజు వేసేందుకు కానీ, వాటి నివారణకు కనీస ప్రయత్నాలు చేసేలా మాత్రం కనిపించడం లేదు. మావోయిస్టుల సమస్య అధికారంలో ఉన్న పక్షాలకు శాంతిభద్రతల సమస్య మాత్రమే. అదే రాజకీయ పక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా పేర్కొంటోంది. తాము అధికారంలోకి వస్తే ఈ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతామని ప్రకటిస్తాయి కానీ ఒకసారి గద్దెనెక్కాక గతమేమీ గుర్తుండదు. మావోయిస్టుల సమస్యకు కారణంలో సమాజంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలే. ఇదే విషయం మావోయిస్టు ప్రతినిధులు అవకాశం వచ్చిన ప్రతిసారి చెబుతుంటారు. ప్రజల మధ్య అసమానతలను నిర్మూలించేందుకు పాలకపక్షాలు ఏమాత్రం చర్యలు తీసుకోనందునే తాము ఆయుధాలు పట్టి పోరాడాల్సి వస్తుందని వారు పలుమార్లు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం దీనికి శాంతియుతమైన పరిష్కారం చూపేందుకు చొరవ తీసుకోవడం లేదు. ఎంతటి జఠిలమైన సమస్యైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు శూన్యమే. ఇలాంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్‌లో జరిగినా రాజ్యం తన అధికార దండాన్ని ప్రయోగించి ప్రక్రియను మొగ్గలోనే తుంచేసింది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి మావోయిస్టులతో చర్చలకు సిద్ధమని ప్రకటించాడు. ఇరువైపులా కాల్పుల విరమణకు ఒక ఒప్పందం చేసుకున్నారు. మావోయిస్టు పార్టీ ప్రతినిధులుగా అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ నేతృత్వంలో కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్‌, గణేశ్‌ జనశక్తి తరఫున వెంకటేశ్వర్లు అలియాస్‌ రియాజ్‌, కూర దేవేందర్‌ అలియాస్‌ అమర్‌ చర్చల్లో పాల్గొన్నారు. ప్రభుత్వంతో పీపుల్స్‌వార్‌ జరిపిన మొదటి విడత చర్చల్లో భూ సమస్య, సామాజిక, ఆర్థిక అసమానతలు రూపుమాపాలని కోరారు. భూ పంపిణీకి తాము సిద్ధమే కాని అసలు భూమి ఎక్కడ ఉందంటూ ప్రభుత్వం మావోయిస్టులను ఎదురు ప్రశ్నించింది. దీనికి ప్రతిగా రియల్టర్ల కబ్జాలో ఉన్న వేలాది ఎకరాల భూమి సంబంధించిన జాబితా సర్కారు చేతుల్లో పెట్టింది. మొదటి విడత చర్చలు ముగిసిన కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. కరీంనగర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జనశక్తి చర్చల ప్రతినిధి రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. నల్లమలలోకి చొరబడిన ప్రభుత్వ పోలీసు బలగాలు అప్పటి రాష్ట్ర కమిటీ కార్యదర్శి బుర్ర చిన్నన్న అలియాస్‌ మాధవ్‌ సహా పలువురిని మట్టుబెట్టారు. దీంతో చర్చల ప్రక్రియకు బ్రేక్‌ పడింది. మావోయిస్టులు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్‌లు అలాగే ఉండిపోయాయి. తర్వాత ప్రభుత్వాలు మావోయిస్టుల సమస్యకు శాంతియుతమైన పరిష్కారం చేపేందుకు కనీస ప్రయత్నాలు చేయలేదు. చర్చల ప్రక్రియ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌ ప్రజాస్వామ్యంలో చర్చల ప్రక్రియ ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకోవచ్చని మావోయిస్టు చర్చలకు పూనుకోవాలని మధ్యవర్తిత్వం చేశారు. ఇందుకు ఆలస్యంగా స్పందించిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియస్‌ ఆజాద్‌ను అజ్ఞాతంలో నుంచి చర్చలకు పంపింది. ఆజాద్‌ ఆదిలాబాద్‌ జిల్లా వాంఖిడి అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దీంతో ఆ ఎన్‌కౌంటర్‌ వివాదాస్పదమై సీబీఐ విచారణ కూడా జరిగింది. తర్వాత ఎవరూ చర్చల ఊసెత్తలేదు. ప్రభుత్వం చర్చల ప్రక్రియలో రాష్ట్రంలో, కేంద్రంలో చిత్తశుద్ధి కనబర్చలేదనేది నిర్విర్వాదాంశం. హింస ప్రతిహింసలకు ఎక్కడో ఒక చోట ఫుల్‌స్టాప్‌ పడాలంటే ఇరువర్గాలు చిత్తశుద్ధితో చర్చలకు ముందుకురావాలి.