సాంకేతికతపై నిరంతర అధ్యయనం అవసరం
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రతినిధి శ్రీనివాస్
శ్రీకాకుళం, జూలై 16 : సాంకేతిక పరిజ్జానంపై నిరంతరం అధ్యయనం అవసరమని హైదరాబాద్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ ప్రతినిధి బి.ఎస్.పి.శ్రీనివాస్ పేర్నొన్నారు. రాజాంలోని జీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘డాట్‌నెట్ అభివృద్ధి-వినియోగం’పై గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇలాంటి జాతీయ సదస్సులతో టెక్నాలజీస్‌పై అధ్యాపకులకు అవగాహన కలిగే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త విషయాలు తెలుస్తాయని, బోధనలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, బోధనలో పూర్తి అవగాహనతో ముందుకు సాగవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి సదస్సులను సద్వినియోగం చేసుకొవాలని కళాశాల ప్రిన్సిపల్ డా. సి.ఎల్.వి.ఆర్.ఎస్.వి.ప్రసాద్ చెప్పారు. కంప్యూటర్ల అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం విస్తారంగా చోటుచేసుకుందని, ఇది ఇతర రంగాల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. సదస్సు నివేధికను కన్వీనర్ జి.అనూరాధ చదివి వినిపించారు. కళాశాలకు చెందిన సీఎస్‌ఈ, ఐటి విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎస్‌ఈ విభాగాధిపతి శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.