హరితహరం కోసం ముందస్తు ప్రణాళిక

భద్రాద్రి కొత్తగూడెం,మే12(జ‌నం సాక్షి): జిల్లాలో హరితహారాన్ని ప్రణాళికా బద్దంగా చేపట్టాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జలగం వెంకటరావు  అన్నారు. వచ్చే హరితహారం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. హరితహారాన్ని విస్తృత పరిచేందుకు అటవీశాఖ ప్రత్యేక శ్రద్ద వహించాలనిసూచించారు. అటవీ శాఖాధికారులతో హరితహారం కార్యక్రమంపై ఎమ్మెల్యే జలగం సవిూక్షించారు.  అటవీశాఖ ఆధ్వర్యంలో హరితహారంలో నాటిన ప్రతీ మొక్క బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ శాఖాధికారి శివాల రాంబాబుకు చెప్పారు. రామవరంలోని స్మృతివనంలో విస్తృతంగా మొక్కలు నాటాలని, జిల్లాకే తలమానికంగా నిలవనున్న సెంట్రల్‌పార్కు 250 ఎకరాల్లో విస్తరించి ఉన్నందున ఔషధ మొక్కలు నాటాలన్నారు. సెంట్రల్‌ పార్కు అభివృద్ధిని వేగవంతం చేయాలని, సిబ్బందిని నియమించి సందర్శకులకు సకల సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా కిన్నెరసానిలో కూడా అత్యధిక మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. డీర్‌ పార్కు విస్తరణ త్వరలో ప్రారంభించనున్నందున ఏర్పాట్లను సిద్దం చేయాలని చెప్పారు.