2014 ఎన్నికల్లో బిసిలకు వందసీట్లు : యనమల వెల్లడి

విజయవాడ, జూలై 18 : బిసిలకు 2014 ఎన్నికల్లో వంద సీట్లు ఇవ్వడమే కాకుండా అభ్యర్ధనలను ఆరు నెలలకు ముందుగానే ప్రకటిస్తామని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ బిసిలను ఆకర్షించడానికి తెలుగుదేశం పార్టీ వంద సీట్లు ఆశచూపడంలేదని మొదటి నుండి కూడా టిడిపినే బిసిలను ప్రోత్సహిస్తూ వస్తున్నదని అన్నారు. తనలాంటి ఎందరో బిసిలకు రాజకీయాల్లో ఉన్నత స్థానాలు దక్కాయంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్నారు. అదేవిధంగా బిసి ఓటర్లు కూడా టిడిపినే ఆదరిస్తూ వస్తున్నారని అన్నారు. తాజా పరిణామాలతో బిసి వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తుందని రామకృష్ణుడు అంగీకరించారు. ఇందుకు గల కారణాలపై పార్టీ విశ్లేషించిందని, పార్టీపై వారిలో ఏర్పడిన అసంతృప్తికి గల కారణాలను అన్వేషించిందని రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే బిసిల్లో టిడిపికి మంచి ఆదరణ ఉన్నదని, దానిని నిలబెట్టుకునేందుకు పార్టీ కృషి చేస్తుందని అన్నారు. వంద సీట్లు బిసిలకు ఇవ్వడం తమ పార్టీ ఎంచుకున్న ప్రథమ సిద్ధాంతమని యనమల అన్నారు.