జడేజాను వివరణ కోరిన బీసిసిఐ
ముంబై ,జూలై 8 (జనంసాక్షి):
ట్రై సిరీస్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా సురేష్ రైనా , రవీంద్రజడేజా గొడవపై బీసిసిఐ స్పందించింది. ఈ వివాదంలో జడేజాను మందలించినట్టు సమాచారం. దీనిపై వెంటనే లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని కూడా బోర్డు అతన్ని ఆదేశించింది. విండీస్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జడేజా-రైనా గొడప పడ్డారు. తన బౌలింగ్‌లో రైనా రెండు క్యాచ్‌లు వదిలేయడంతో జడేజా అతనిపై సీరియస్ అయ్యాడు. సాధారణంగా ఫీల్టింగ్‌లో చురుగ్గా కదిలే రైనా 26వ ఓవర్‌లో దినేష్ రామ్‌దిన్ ,32వ ఓవర్లో సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్‌లను అందుకోలేకపోయాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన జడేజా అతన్ని కోప్పడ్డాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వీరిద్దరూ వాదించుకోవడంతో కోహ్లీ సర్థి చెప్పాడు. ఈ ఘటనపై విూడియాలో వచ్చిన కథనాలను చూసిన తర్వాత బీసిసిఐ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
ఒక ప్రముఖ పత్రిక కథనం ప్రకారం రైనా కెప్టెన్సీపై కూడా జడేజా కామెంట్ చేసినట్టు , గొడవకు అతనే కారణమైనట్టు తెలుస్తోంది. దీనిపై బోర్డు పెద్దలు అసహనం వ్యక్తం చేయడంతో పాటు జడేజాను వివరణ కోరాయి. అతను ఇచ్చిన వివరణ ప్రకారం తర్వాత తీసుకునే చర్యలపై నిర్ణయం ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి.