గొంతెమ్మ కోర్కెలు ఎవరు కోరారు
పాత హైదరాబాద్ స్టేటే తెలంగాణ
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే ఇవ్వాలి : నారాయణ
హైదరాబాద్, జూలై 24 (జనంసాక్షి) :
ఎక్కడైనా మొరిగే కుక్కలు కరువవని, కరిచే కుక్కలు అరువవని, ఆ సామెత కాంగ్రెస్ పార్టీకి నూటికి నూరు శాత వర్తిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పేర్కొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో అయిదు వామపక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన ఐక్య కూటమి పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలుగాని, ఇదిగో ఇస్తున్నాం. అదిగో ఇస్తున్నాం అంటూ కాంగ్రెస్ చేస్తున్న హడావుడి అంతా ప్రజలను మభ్యపెట్టేందుకేనని ఆరోపంచారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దాగుడు మూతలాడుతుందని చెప్పడానికి కమిటీల సమావేశాల పేరుతో కాలయాపనే నిదర్శనమన్నారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ముగ్గురు తోడు దొంగలేనని ఆరోపించారు. లీకుల రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను, పార్టీలను గందర గోళంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 28న హైదరాబాద్‌లో సిపిఐ ఆద్వర్యంలోని ఐదు కమ్యూనిస్టు పార్టీల ఐక్యవేదిక ఆద్వర్యంలో భారీ సదస్సును నిర్వహిస్తున్నామని నారాయణ ప్రకటించారు. హైదరాబాద్‌ను కొంత కాలం ఇరుప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా చేయడానికి తమకు ఎలాంటి అబ్యంతరంలేదన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో సమాధికట్టడం ఖాయం అన్నారు. తెలంగాణ ప్రజలను ఆడుకునే హక్కు మీకెవరిచ్చారని నిలదీశారు. అలాంటి చేతగాని వారు ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు.