కోర్టులో హాజరునుంచి అనీల్‌ అంబానీకి మినహాయింపు

న్యూఢిల్లీ,జులై25: రిలయన్స్‌ అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ 2జీ కేసులో ప్రాసిక్యూషన్‌ సాక్షిగా శుక్రవారం కోర్టుకు హాజరు కాలేనని, హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా ఖరారైన వ్యాపార పనుల కారణంగా తాను కోర్టుకు హాజరుకాలేనని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా తాను న్యాయస్థానానికి రాగలనని అనిల్‌ తెలిపారు. ఢిల్లీ న్యాయస్థానం ఆయన అభ్యర్థనను మన్నించినట్లు సమాచారం.రిలయన్స్‌ అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ 2జీ కేసులో శుక్రవారం  ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు ప్రాసిక్యూషన్‌ సాక్షిగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.  ట్రయల్‌కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన రిలయన్స్‌ టెలికాం లిమిటెడ్‌ దరఖాస్తును సుప్రీంకోర్టు గురువారం అత్యవసరంగా విచారించడానికి నిరాకరించింది. న్యాయస్థానం ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.