సీమాంధ్రకు ప్యాకేజీ తెలంగాణపై వెనక్కు తగ్గం

కిరణ్‌ వ్యాఖ్యలను లైట్‌గా తీసుకున్న డిగ్గిరాజా
రాష్ట్ర విభజనకు వైఎస్‌ శ్రీకారం చుట్టాడు : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (జనంసాక్షి) :
సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, తెలంగాణ ఏర్పాటుపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గబోమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం ఏపీిఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలి.. సమస్యలను ఆంటోని కమిటీకి తెలియజేయాలని కోరారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనలు విరమించాలని కోరుతున్నా నన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేకూరుతుందని తెలిపారు. విభజనవల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర విభజనపై ఎలాంటి సందేహాలనైనా ఆంటోని కమిటీకి చెప్పాలన్నారు. అన్ని ప్రాంతాల విద్యార్థులు ఢిల్లీ, ముంబయి, చెన్నయ్‌, బెంగళూరు, హైదరాబాద్‌లలో చదువుకుంటున్నారని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు, విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టంచే శారు. సీమాంధ్రలో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిందన్నారు. ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. విభజన ప్రక్రియ ప్రభుత్వ అనుకూలంగా ఉంటుందన్నారు. ఉద్యోగాలు, విద్య గురించి కొన్ని విజ్ఞప్తులను సీడబ్ల్యూసీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిందన్నారు. విభజనపై అన్ని పార్టీలతో చర్చించాకే కాంగ్రెస్‌ పార్టీ తుది నిర్ణయం తీసుకుందని అన్నారు. 1999లో సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్సార్‌ తెలంగాణ విభజనను ప్రతిపాదించారని, 2004 ఎన్నికల మేనిఫెస్టోలో అదే అంశాన్ని పొందుపరి చారని, అంతేగాక ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నామని తెలియజేశారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలను డిగ్గిరాజా లైట్‌గా తీసుకున్నారు. ఆయన ధిక్కార ధోరణితో మాట్లాడలేదని అన్నారు. సీఎంతో మాట్లాడి ఆయన వివరణ పట్ల సంతృప్తి చెందానని అన్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టంచేశారు. వైఎస్‌ ప్రతిపాదనలను వైఎస్సార్‌ సీపీ గుర్తించాలని ఆయన కోరారు. తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ సమ్మతి తెలియజేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చని అన్నారు. ఆంటోని కమిటీ కాంగ్రెస్‌ పార్టీ నియమించిన కమిటీ కాదని స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రక్రియ నిలిచిపోయిందని సీమాంధ్ర ప్రాంత నేతలు చేస్తున్న వాదనలో నిజం లేదని తేలిపోయింది. గందరగోళం సృష్టించేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని స్పష్టమైంది. తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని దిగ్విజయ్‌సింగ్‌ తేల్చి చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కాంగ్రెస్‌ వాదులంతా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోయిందన్న వార్తలను కొట్టిపడేశారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని, వేగంగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్‌కు చెందిన ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. విభజనపై ఎవరికి ఎలాంటి అపోహలు, అభిప్రాయాలు ఉన్నా ఆంటోనీ కమిటీకి చెప్పుకోవచ్చన్నారు. సీమాంధ్రుల సమస్యల అధ్యాయనంపై కమిటీ పని చేస్తుందన్నారు. విభజన సమస్యలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. మంగళవారం సాయంత్రం నుంచి కమిటీ పని ప్రారంభిస్తుందన్నారు. ఈ కమిటీ అందరి అభ్యంతరాలకు పరిష్కారం చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.