తెలంగాణపై ఎందుకు లేఖ రాయలేదు?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్ర సాగుతున్న కృత్రిమ ఉద్యమానికి సహజత్వం ఆపాదించేందుకు సీఎం కిరణ్‌, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నాలు లేవు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకొని నెల రోజులు గడుస్తున్నా సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమంలో ఇంతవరకూ సహజత్వం కానరాని దుస్థితి. తమ చేతుల్లోని మీడియా ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకూ చూపిందే చూపుతూ, చెప్పిందే చెప్తోన్న ఇంతవరకూ సీమాంధ్ర గ్రామ స్థాయికి చేరలేదు. తెలంగాణ ఉద్యమంతో సీమాంధ్ర ప్రాంతంలో సాగుతున్న ఉద్యమాన్ని సరిపోల్చాలని చూసి సీమాంధ్ర పెత్తందారుల చేతుల్లోని మీడియా బొక్కబోర్లా పడింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుపంతా హైదరాబాద్‌పైనే. తమకు దక్కని హైదరాబాద్‌ తెలంగాణ ప్రజలకు కూడా దక్కొద్దనే దుర్మార్గపు ఆలోచన వారిది. అది ఒక్క పెత్తందారులకే పరిమితం అనుకుంటే పొరపాటే. వారిని పెంచిపోషించిన రాజకీయ నాయకులదీ అదే ధోరణి. ఇంతకాలం తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారాన్ని అనుభవించిన వివిధ పార్టీల నేతలు తెలంగాణ ప్రజలను ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. తెలంగాణపై కాంగ్రెస్‌ ప్రకటన, యూపీఏ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ప్రారంభించాక చంద్రబాబు ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమానికి ఆయన కరిగిపోయి గగ్గోలు పెడుతున్నాడు. ఇదివరకే ఒకసారి ప్రధానికి లేఖ రాసిన బాబు బుధవారం మరోలేఖను పంపారు. సీమాంధ్రలో నెలకొన్న ఆందోళనలపై దృష్టి సారించాలని, కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న ఆందోళనలు మీరు పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు పరిష్కరించే బాధ్యత మీది కాదా? నిలదీశారు. సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటన సీమాంధ్రులను రెచ్చగొట్టేవిధంగా ఉండగా, రాజ్యసభలో చిదంబరం చేసిన ప్రకటన నిర్లక్ష్యంగా ఉందంటూ చండ్రనిప్పులు చెరిగారు.  సీమాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది జీవితాలను సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రభావితం చేసిందని చెప్పే చంద్రబాబు, మరి తెలంగాణలో నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమంపై ఒక్కరోజు ఎందుకు స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమాలు చేసిన వారిని వివిధ పేర్లతో హత్య చేయించిన చరిత్ర తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలది. తెలంగాణ ప్రాంత వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కొళ్లగొట్టిన ఘనకీర్తి ఈ రెండు పార్టీల సొంతం. హైదరాబాద్‌లోని నిజాం భూముల సంతర్పణ మొదలు పెట్టిన మహానుభావుడే చంద్రబాబు. ఇక్కడి ప్రజలను విలాసాలకు గోల్ఫ్‌కోర్టులకు, రేస్‌కోర్సులకు కేటాయించింది ఘనుడు ఈ బాబే. తర్వాతి కాలంలో ఇది కట్టలు తెంచుకొని పెను ప్రవాహమైన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రజానీకం నిలదీస్తే అధికార కాంగ్రెస్‌ తెలుగుదేశం వైపు వేలెత్తి చూపిన బాధ్యతారాహిత్యం అందరికీ తెలిసిందే. తెలంగాణను సర్వం దోచుకున్నది, అనతికాలంలోనే కుభేరులుగా మారింది ఎవరో జగద్వితితం. అలాంటి వ్యక్తులు సృష్టించిందే సమైక్యాంధ్ర ఉద్యమం. ఆ ఉద్యమానికి చంద్రబాబు ఇప్పుడు అండగా నిలబడ్డాడు. తెలంగాణ దోపిడీ సాగాల్సిందేనని దాదాపుగా తేల్చేశాడు. ప్రతిసారి ఆయన చెప్తున్న మాట ఒక్కటే తెలంగాణ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని గుర్తింపుపొందిన అన్ని పార్టీలు తెలంగాణపై ఏదో ఒక వైఖరి వ్యక్త పరిచాయి. ఎంఐఎం వివిధ ప్రతిపాదనలు ముందుకు తీసుకురాగా, సీపీఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది. మిగతా ఐదు పార్టీలు తెలంగాణకే పచ్చజెండా ఊపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై విధానపరమైన నిర్ణయం తీసుకొని యూపీఏ ప్రభుత్వానికి నివేదించింది. యూపీఏ ప్రభుత్వం ఈమేరకు రాజ్యాంగపరమైన ప్రక్రియ ప్రారంభించింది. కేబినెట్‌ నోట్‌ సిద్ధం చేసి, పార్లమెంట్‌ ముందుకు బిల్లు తీసుకురావడమే మిగిలుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు తమకు తెలిసిన కుట్ర రాజకీయాలతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వారికి సీఎం కిరణ్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు దన్నుగా నిలుస్తున్నారు. సీమాంధ్రలో సాగుతున్న కృత్రిమ ఉద్యమానికే ఇంతగా కరిగిపోయిన రెండుకళ్ల బాబు తెలంగాణ కోసం వెయ్యి మందికి పైగా విద్యార్థులు, యువత ఆత్మబలిదానాలు చేసుకుంటే కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. ఎందుకు వారివేవి ప్రాణాలు కావా? లేక వాటికి విలువ లేదా? ఇబ్బందుల కంటే ప్రాణత్యాగాలు చాలా తక్కువని చులకన అభిప్రాయం బాబుకుందా? అలాగే తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఒక్కరోజు కూడా బాబు గొంతెత్తి ప్రశ్నించింది లేదు. పైపెచ్చు అసెంబ్లీలో తెలంగాణ మాటే ఎత్తొద్దని నిషేధం పెట్టిన మహానుభావుడాయన. తెలంగాణకు దక్కాల్సిన నిధులు సీమాంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నా, తెలంగాణకు చెందాల్సిన ఉద్యోగాల్లో సీమాంధ్ర ప్రాంతీయులకు తానే స్వయంగా పోస్టింగులు ఇచ్చినా, నిజాం భూములను తానే అప్పనంగా దోచిపెట్టినా, ఒక విమానాశ్రయం ఉండగానే మరో విమానాశ్రయం పేరుతో రైతుల పొట్టగొట్టి వారి నుంచి రెండు వేల ఎకరాలు లాక్కున్నప్పుడు కూడా తాను చేస్తున్నది అన్యాయమని చంద్రబాబుకు గుర్తుకు రాలేదు. తన చేతిలో ఉన్న రాజ్యదండం కల్పించిన హక్కుగా ఆయనే స్వయంగా దోపిడీదారుడి అవతారమెత్తాడు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు చేయబోయే వేళ మరికొందరు దోపిడీదారులతో జట్టుకట్టాడు. బాబుకే కాదు సీమాంధ్ర పెత్తందారుల లక్ష్యం ఒక్కటే వారికి హైదరాబాద్‌ కావాలి. తాము పొట్ట చేతపట్టుకొని వస్తే అపర కుభేరులుగా మార్చేసిన హైదరాబాద్‌ అండ కావాలి. హైదరాబాద్‌ పంచన వారు బతకాలి. హైదరాబాద్‌ను చూపి తమ పబ్బం గడుపుకోవాలి. కానీ హైదరాబాద్‌ తమది కాదని, తాము బతకవచ్చిన వాళ్లమనే విషయం మాత్రం ఒప్పుకోరు. పై పెచ్చు హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటారు. ఈ గొప్పలు కూడా మొదట బాబుకే సొంతం. మరి ఆయనే కదా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది. కాబట్టి ఇప్పుడు ఆ హైదరాబాద్‌ కావాలి. అది తెలంగాణ వారికి అస్సలే దక్కొద్దు. అందుకే చంద్రబాబు కృత్రిమ ఉద్యమానికి జై కొట్టి తాను కృత్రిమ వాదినని తెలంగాణ వ్యతిరేకినని స్పష్టం చేశాడు. ఇప్పుడు ఆ బాబు అవసరం మనకెందుకు అని తేల్చుకోవాల్సింది మాత్రం తెలంగాణ ప్రజానికమే.