‘నిర్భయ’ దోషులనే కాదు దిగజారిన వ్యవస్థనూ ఉరి తీయాలి

ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు ఎదుట రెండు రోజుల ఒకే డిమాండ్‌ బలంగా వినవస్తోంది. నిర్భయపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన దోషులను ఉరి తీయాలనేది ఆ డిమాండ్‌. వారిని ఉరి తీయడం ద్వారా బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులను నివారించవచ్చనేది వారి అభిప్రాయం. సాకేత్‌ కోర్టు ఈ కేసులో మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారించిన మంగళవారం, వారికి శిక్షలు ఖరారు చేస్తామన్న బుధవారం రెండు రోజులు కోర్టు బయట ఒకటే హడావుడి. దేశాన్నే కుదిపేసిన దారుణానికి ఒడిగట్టిన వారికి ఏం శిక్ష పడుతుందనే ఒక్కటే ఉత్కంఠ. ఒక్క సాకేత్‌ కోర్టు ఎదుట శిక్ష ఏమిటో తెలుసుకునేందుకు వేచి ఉన్న వారే కాదు యావత్‌ భారతమంతా ఈ కేసులో ఎలాంటి తీర్పు రాబోతుంది అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నిర్భయపై అత్యాచారం చేసిన కీచకులను ఉరితీయాలని దేశవ్యాప్తంగా మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌ 16న దేశ రాజధాని ఢిల్లీలో నడుస్తున్న బస్సులో పారమెడికల్‌ విద్యార్థిని(23)పై ఆరుగరు కామాంధులు సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఉదంతం యావత్‌ దేశాన్ని కదిలించింది. స్నేహితుడితో కలిసి సినిమా చూసి వస్తున్న పారామెడికల్‌ విద్యార్థినిని బస్సులో ఎక్కించుకున్న ఆరుగురు ఆమె స్నేహితుడి దారుణంగా కొట్టి నిర్భయపై దారుణ అత్యాచారానికి ఒడిగట్టారు. ఇనుప పైపులతో ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్నేహితుడితో కలిపి నడుస్తున్న బస్సులోంచి బయటికి తోసేశారు. పదకొండు రోజులపాటు మృత్యువుతో పోరాడిన నిర్భయలోని బతకాలనే కాంక్ష ఎందరిలోనో స్ఫూర్తి నింపింది. ఆమె కోసం ప్రతి హృదయం రోదించింది. బతికి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంది. కానీ మృత్యువే పైచేయి సాధించింది. ఆమె భౌతికంగా లోకాన్ని వీడినా ఆమె స్ఫూర్తిమాత్రం ప్రతి ఒక్కరిలోనూ నిండిపోయింది. నిర్భయపై దారుణ మానభంగానికి ఒడిగట్టిన వారిలో ప్రధాన నిందితుడు బస్సు డ్రైవర్‌ విచారణ ఎదుర్కొంటున్న సమయంలోనే తీహార్‌ జైల్‌లోని తన సెల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దోషుల్లో ఒకరైన బాలుడికి జువెనైల్‌ బోర్డు కోర్టు కొద్ది రోజుల క్రితమే మూడేళ్ల శిక్షను ఖరారు చేసింది. మిగిలిన నలుగురు నిందితులను మంగళవారమే సాకేత్‌ కోర్టు దోషులుగా నిర్ధారించి, బుధవారం శిక్షలు నిర్ధారించనున్నట్లు ప్రకటించింది. శిక్షలు ఖరారు చేయడానికి ముందు శిక్షలపై దోషుల వాదనలూ వింటామని న్యాయమూర్తి పేర్కొన్నారు. బుధవారం ప్రాసిక్యూషన్‌, డిఫెన్స్‌ తరఫున న్యాయవాదుల వాదనను సాకేత్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి యోగేశ్‌ ఖన్నా నమోదు చేశారు. శిక్షను శుక్రవారం ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నడిరోడ్లపై బస్సును తిప్పుతూ నిర్భయపై సామూహిక అత్యాచారం జరిపినా పసిగట్టడంలో విఫలమైన ఢిల్లీ పోలీసులు సహా యావత్‌ దేశం దోషులను ఉరితీయాలని ముక్తఖంఠంతో డిమాండ్‌ చేస్తోంది. నిర్భయ ఘటన యావత్‌ దేశాన్ని ప్రభావితం చేసింది కాబట్టి ఈ కేసు విచారణలో ప్రతి అంశం ఆసక్తి గొల్పుతోంది. కానీ నిత్యం నిర్భయలాంటి ఘటనలు వందలాదిగా చోటు చేసుకుంటున్నాయి. నిర్భయ అత్యాచారం, హత్య ఉదంతం తర్వాత కూడా మహిళలపై లైంగిక వేధింపులు, సామూహిక లైంగిక దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిర్భయ చట్టం దోషులను శిక్షించడానికే మినహా బాలికలు, యువతులు, మహిళల రక్షణకు అంతగా దోహద పడలేదని ఘనంకాలు చెప్తున్నాయి. ఒళ్లు గగుర్పాటు కలిగించే ఈ చేదు నిజాన్ని అందరూ అంగీకరించి తీరాలి. నిర్భయ ఘటన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఆగస్టు 15 వరకు 1,036 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వెలుగు చూసిన రేప్‌ల సంఖ్య ఇంత తీవ్రంగా ఉంటే గుట్టుగా దాచిపెట్టినవో, బెదిరించి బయటికి పొక్కకుండా చేసినవో ఇంకా అంతే సంఖ్యలో అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. గతేడాది ఇదే సమయంలో 661 కేసులు నమోదయ్యాయి. 2010లో 507, 2009లో 469, 2008లో 466, 2007లో 598, 2006లో 623, 2005లో 658, 2004లో 551, 2003లో 490 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. గడిచిన దశాబ్దకాలంలో హై సెక్యూరిటీ జోన్‌గా ఉన్న ఢిల్లీలో నమోదయిన అత్యాచార ఘటనల గణాంకాలు ఇలా ఉంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఆధిపత్య కులాలు, వర్గాలు రాజ్యమేలే ప్రాంతాల్లో మహిళల రక్షణ పరిస్థితిని, ప్రమాణాలను అర్థం చేసుకోవచ్చు. దేశంలో సగటున 20 నిమిషాలకో మహిళపై అత్యాచారం జరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. 2012లో దేశవ్యాప్తంగా 24,923 మంది మహిళలపై అత్యాచారం జరిగినట్టుగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే ఆ సంఖ్య చెరిగిపోయింది. అంటే నిర్భయ చట్టం అమల్లోకి వచ్చాక కూడా మహిళలకు భద్రత లేకుండా పోతుంది అన్నది వాస్తవం. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నిందితులను గుర్తించడం, అరెస్టు చేయడం వేగంగా జరుగుతుందే తప్ప అత్యాచారాల నిరోధం మాత్రం జరగడం లేదు. నిర్భయ కేసులో తీర్పు శుక్రవారానికి వాయిదా వేసిన మూలంగా మరో రెండు రోజుల పాటు వారిని ఉరితీయాలని కోరుతూ ఆందోళనలు కొనసాగడం ఖాయం. అయితే మనం ఇక్కడ గుర్తించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నిర్భయ కేసులో దోషులను ఉరితీస్తే మహిళలపై లైంగిక వేధింపులు ఆగిపోతాయనుకోవడం అత్యాశే అవుతుంది. మనుషులు ముసుగు వేసుకున్న తోడేళ్లు సంచరించే లోకంలో అలాంటి ఘటనలు ఆపడానికి ఉరి శిక్ష మాత్రమే సరిపోదు. ప్రపంచీకరణ ప్రభావంతో మనదేశంతో ఎంతో దిగజారి కొంత ప్రగతిని మూటగట్టుకుంది. ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాలు చౌకగా లభించడం ఎంత స్థాయిలో మంచి చేసిందో అంతకంటే ఎక్కువ చెడునే అందించింది. ఇంటర్నెట్‌ నిండా ఫోర్నో సైట్లు, అశ్లీల, బూతు సాహిత్యం ఒక్క క్లిక్‌తో వచ్చేస్తున్నాయి. అవి విద్యార్థులు, యువత మనసులను పెడదారులు పట్టిస్తున్నాయి. అలాగే సోషల్‌ మీడియా అశ్లీల, బూతు మాటలకు చిరునామాగా మారింది. ఇక సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలు అతి జుగుప్సాకరంగా ఉంటున్నాయి. వీటికి తోడు సర్కారే దళారీగా మారి బొక్కసాన్ని నింపుకునేందుకు యువతతో ఇష్టం వచ్చినట్లుగా మద్యం తాగిస్తోంది. మద్యం మత్తులో అశ్లీల మాస్‌ మీడియా ప్రభావానికి లోనైన యువతి మహిళలు కనబడితే తోడేళ్లలా రెచ్చిపోతున్నారు. ఏం చేస్తున్నారో, దానికి పర్యవసానాలేమిటో తెలుసుకోలేని స్థితిలోకి యువత నెట్టివేయబడుతోంది. అమ్మాయిలు ఉన్నదే వేధించడానికి అని చెప్పే సినిమాలు, అంతకంటే జుగుప్సాకరమైన డైలాగులు వల్లించే ఏ సర్టిఫికెట్‌ సినిమాలు, వాటిని తలదన్నే రీతిలో బుల్లితెర కార్యక్రమాలు యువతను పూర్తిగా చెడుదారి పట్టిస్తున్నాయి. మద్యం మత్తులో అత్యాచారం చేశామని నిర్భయ కేసులో దోషులు కోర్టుకు చెప్పుకున్నారు. ఇక్కడ వారిని క్షమించాలని కోరడం కాదుగానీ వారిని అత్యాచారం దిశగా పురిగొల్పిన దిగజారుడు వ్యవస్థనూ దోషిని చేయాలి. అశ్లీలాన్ని చూపించి, చెప్పించి వాటిని సొమ్ము చేసుకునే మాస్‌ మీడియా, ఖజానా నింపుకునేందుకు విచ్చలవిడిగా మద్యం అమ్మించే ప్రభుత్వమూ ఇందుకు బాధ్యత వహించాలి. ఆవుకు విషం తాగించి పాలు పిండుకోవాలని చూస్తే విషమే వస్తుంది తప్ప పాలు రావు. యువతతో మద్యం రూపంలో విషం తాగిస్తున్న ప్రభుత్వం వారి నుంచి మంచిని ఆశించడం వృథా ప్రయాసే. విషం తాగే వాళ్లు విషమే చిమ్ముతారు. ఆ విషం ఎందరో అమాయకుల జీవితాలను బలితీసుకుంటుంది. ఎందరికో గర్భశోకాన్ని మిగులుస్తుంది. నిర్భయను పాశవికంగా హత్య చేసిన నలుగురు దోషులనే కాదు దిగజారిన వ్యవస్థనూ ఉరి తీస్తేనే ఇలాంటి ఘటనలు ఆగిపోతాయి. బాలికలు, యువతులు, మహిళలు తలెత్తుకొని జీవించే అవకాశం దక్కుతుంది.