అవి విద్వేషాలు కావు రాజకీయ ప్రేరేపిత ఘటనలు
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో అప్పుడప్పుడు అపశ్రుతిలా ధ్వనించేవి మత కలహాలు. భారత్ స్వాతంత్ర రాజ్యాంగంగా అవతరించిన తర్వాత అనేక ప్రాంతాల్లో ఈ పేరుతో ఆధిపత్యవర్గాలు తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాయి. తమకు అనుకూలంగా ఉన్న ఒక వర్గం వారిని ఇంకో వర్గం వారిపైకి ఎగదోసి ఆయుధాలిచ్చి నరమేధానికి ప్రయత్నించాయి. ఆ ఆధిపత్యవర్గాలే కాలక్రమంలో రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందాయి. ఏ రాజకీయ పక్షానికి అధికార దాహం వేస్తే అప్పుడు ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడం ఆనాదిగా జరుగుతూ వస్తోంది. కొంతకాలం తర్వాత వ్యక్తుల మధ్య ఆధిపత్యం పోరాటమూ ఈ విద్వాషాలు రగిల్చింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో రగిలిన విద్వేషాలు 50 మందిని పొట్టనబెట్టుకోగా, వందలాది మందిని వైకల్యం బారిన పడేశాయి. 1990లో హైదరాబాద్‌లో మత విద్వేషాలు చెలరేగింది కూడా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని గద్దె దింపేందుకేననేది అందరికీ తెలిసిన నిజం. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత పదవీదాహం ఇరువర్గాలకు చెందిన అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. గంగాజమున తహజీబ్‌కు ప్రతీకైన హైదరాబాద్ నగరం మొదటిసారిగా వర్గ విద్వేషాల నెత్తుటితో తడిసింది. స్వాతంత్య్ర భారతదేశంలో రాజకీయ పార్టీలకు, నాయకులకు అధికార దాహం వేసిన ప్రతీసారి అమాయక ప్రజలు ఈ విద్వేషాలకు బలికావడం మామూలైపోయింది. 1969లో గుజరాత్‌లో జరిగిన మత విద్వేషాలు 660 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత దశాబ్దం వరకూ అలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. 1980లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ముస్లింలు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలు తర్వాత హిందూ, ముస్లిం ఘర్షణలుగా రూపాంతరం చెందాయి. ఈ ఘర్షణల్లో 400 మంది మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించినా అసలు మృతులు 2500 మందికి పైమాటేనని చెప్తారు. అదే ఏడాది త్రిపురలో స్థానికులు కాందిశీకుల మధ్య ఘర్షణలు మరో 500 మంది మరణానికి కారణమయ్యాయి. 1983లో అస్సాంలో జరిగిన ఘర్షణలు 2,191 మంది ముస్లింల ఊచకోతకు దారి తీశారు. ఆ మరుసటి ఏడాది పంజాబ్‌లో ఉగ్రవాదులు జరిపిన విధ్వంసంలో 11 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యంత దారుణమైన ఘర్షణలుగా సిక్కుల ఊచకోత నిలబడిపోతుంది. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కులు లక్ష్యంగా జరిపిన ఊచకోతలో 4 వేల మంది వరకు దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్‌లో 1986లో జరిగిన వేర్వేరు ఘర్షణల్లో 60 మంది వరకు హిందువులు హత్యకు గురయ్యారు. 1987లో ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌లో జరిగిన ఘర్షణలు 42 మంది ముస్లింల హత్యలకు కారణమయ్యాయి. అదే ఏడాది హర్యానాలోని ఫత్హేబాద్‌లో ఉగ్రవాదుల రక్తదాహానికి 80 మంది హిందువులు బలైపోయారు. 1989లో బీహార్‌లోని భగల్‌పూర్‌లో జరిగిన ఘర్షనలో 1,070 మంది మృత్యువాతపడగా వారిలో అత్యధికులు ముస్లింలే. 1988లో పంజాబ్ సిక్కు తీవ్రవాదులుగా చెప్తున్న వారు సుమారు వంద మంది హిందువులను బలితీసుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి (అప్పటి బాంబే)లో 1992 డిసెంబర్ నుంచి 1993 జనవరి వరకు జరిగిన ఘర్షణలు యావత్ దేశంలో ప్రభావం చూపాయి. రెండు నెలల పాటు జరిగిన ఈ ఘర్షణల్లో 1,125 మంది ముస్లింలు, 275 మంది హిందువులు, 45 మంది గుర్తు తెలియని వారు, ఐదుగురు ఇతరులు బలయ్యారు. దేశ చరిత్రలో చెరగని నెత్తుటి మరకగా చెప్పుకునే గుజరాత్‌లోని గోద్రా తదనంతర పరిణామాల్లో రెండు వేల మంది వరకు ముస్లింలు హత్యకు గురయ్యారు. 300 మంది వరకు హిందువులు హత్యకు గురయ్యారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురుగమిస్తోన్న వేళ గోద్రా, అహ్మమాదాబాద్ ఘర్షణలు మాయని మచ్చగా నిలిచాయి. 2012లో అస్సాంలో స్థానిక గిరిజనులు, క్రిస్టియన్లు, హిందువుల మధ్య 77 మంది మృత్యువాత పడ్డారు. వీటితో పాటు ఒకవర్గం ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు పలుమార్లు బాంబులతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించి వందలాది మందిని బలితీసుకున్నాయి. ఈ మొత్తం ఘటనల వెనుక ఆయా ప్రాంతాల్లో రాజ్యాధికారం కోరుకుంటున్న పార్టీలు, వ్యక్తుల స్వార్థం మినహా మరేమి లేదు. భారతదేశం విభిన్న మతాలు, వర్గాలు, కులాలు, తెగల సమ్మిళితం. వేర్వేరు ఆచార వ్యవహారాలు ఉన్నా అందరూ అన్నదమ్ముల్లా కలిసుండే గొప్పదనం మన దేశంలో మాత్రమే కనిపిస్తుంది. ఆయా ఆచార వ్యవహారాలనో, ఇతర సున్నితమైన అంశాలనో పావులుగా చూపి స్వార్థ రాజకీయ వర్గాలు వారి మధ్య విద్వేషాలు రగల్చి ఆ మంటలో చలికాగడం పచ్చినిజం. భారతీయుల మధ్య నిజంగా విద్వేషాలే ఉంటే.. ఇప్పుడు ముజఫర్‌నగర్‌లో జరిగిన లాంటి ఘటనలు ఎప్పడూ చోటుచేసుకునేవి. ఈ క్రమంలో ఏదో ఒక వర్గం పూర్తిగా అంతరించిపోయేది. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. ప్రజలు రాజకీయ ప్రేరేపిత కారణాలతో మినహా అనవసరంగా కొట్టుకొని చచ్చిపోయిందే లేదు. ఎక్కవ వైషమ్యాలు చెలరేగిన వాటి జీవిత కాలం బహుస్వల్పం. కొద్ది మంది స్వార్థశక్తుల చేతుల్లో పావులుగా మారిన అతికొద్ది మంది ప్రజల మధ్య విద్వేషాలు రగల్చాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అదే పరిస్థితి ఇప్పుడు ముజఫర్‌నగర్‌లోనూ పునరావృత్తమైంది. ముజఫర్‌నగర్ మూడు, నాలుగు రోజులు అట్టుడికింది. ఈ ఘర్షణలు 50 కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపాయి. కానీ ఇప్పుడు ముజఫర్‌నగర్ కోలుకుంటోంది. అక్కడి ఆస్పత్రుల్లో గాయపడి చికిత్స పొందుతున్న ముస్లింల కోసం హిందువులు ఆస్పత్రుల వద్దే ప్రత్యేకంగా వంటలు చేసి వడ్డిస్తున్నారు. ముస్లింలు గాయపడిన హిందువులకు సాయపడుతున్నారు. మరి ఈ రెండు వర్గాలే మూడు, నాలుగు రోజుల పాటు కొట్టుకు చచ్చాయనే అపప్రద మూటగట్టుకున్నాయి. దేశంలో జరిగిన అనేక ఘర్షణలు ఈ రెండు వర్గాల మధ్యే జరిగాయి. రెండు వర్గాలు భారీగా జననష్టాన్ని చవిచూశాయి. కానీ అవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలే. ఇందుకు ప్రస్తుత ముజఫర్‌నగరే తార్కాణం. రెండు వర్గాలు ప్రజల మధ్య విద్వేషాలే ఉంటే దేశం రావణకాష్టంగా ఎప్పుడూ మండుతుండాలి. కానీ ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి కనిపించడం వెనుక రాజకీయ స్వార్థ ప్రయోజనాలు సుస్పష్టం. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ రాజకీయంగా ఉన్న అనుభవలేమి కావొచ్చు, ఇతర కారణాలేమైనా కావొచ్చు.. పరిపాలనలో కాస్త మెతగ్గా వ్యవహరిస్తున్నాడనేది సుస్పష్టం. ఆయన చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేసి పాలనపై ప్రజల్లో వెగటు పుట్టిస్తున్నాడు. స్వతహాగా గుండాల పార్టీగా ముద్రపడిన సమాజ్‌వాదీకి ఈ ఘర్షణలను అణచలేకపోయిందనే అపప్రద అంటగట్టాలని అక్కడ అధికారం కోసం అర్రులు చాస్తున్న బీజేపీ, పూర్వ వైభవం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇరువర్గాలను ఘర్షణలకు ఉసిగొల్పినట్లు చెప్తున్నారు. ముజఫర్‌నగర్‌లో రాజకీయ కారణాలతోనే ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగాయి. అవి వందలాది కుటుంబాలను కోలుకోకుండా చేశాయి. కానీ గాయాల నుంచి ముజఫర్‌నగర్ త్వరగానే కోలుకుంటోంది. ఒక్క ముజఫర్‌నగరే కాదు యావత్ దేశం ఇలాంటి నెత్తుటి మరకలను త్వరగానే తుడిచేసి కొత్త రుతువులోకి ఉత్సాహంగా ప్రవేశిస్తుంది.